PEN POWER
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 5:17 pm Posted By : PEN POWER MEDIA

ఎయిర్‌పోర్ట్ సిద్ధం.. రహదారులే సవాల్!

  • భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. ప్రయాణ భారం ఎలా తగ్గుతుంది?
  •  ప్రారంభానికి సిద్ధమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
  • ప్రయాణికులకు ప్రధాన అడ్డంకిగా ట్రాఫిక్ సమస్య
  • విశాఖ నుంచి గంటన్నర దాటే ప్రయాణ సమయం
  • అనకాపల్లి, గాజువాక నుంచి జాతీయ రహదారే ఆశాకిరణం
  • ప్రత్యేక కనెక్టివిటీ రోడ్లపై పెరుగుతున్న డిమాండ్
  • వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించిన ఏడు రహదారులపై ఆశలు
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. ప్రయాణ భారం ఎలా తగ్గుతుంది?
  • రహదారి అనుసంధానం మెరుగుపడితేనే విమానాశ్రయానికి పూర్తి స్థాయి ప్రయోజనం
     
    ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతుండగా, ప్రయాణికులకు ప్రధాన సవాలుగా రహదారి అనుసంధానం మారింది. విమానాశ్రయం సిద్ధమైనా విశాఖ నగరం, అనకాపల్లి, గాజువాక, స్టీల్‌ప్లాంట్ ప్రాంతాల నుంచి చేరుకునే సమయంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత కొత్త రహదారులు అందుబాటులోకి రాకపోతే ప్రయాణ భారం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
     
    బ్యూరో రిపోర్ట్  పెన్ పవర్,  విశాఖపట్నం, జూన్ 9:

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. మరో నెల రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి రానుండటంతో ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనున్నట్లు సమాచారం. దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను నిర్వహించేందుకు పలు ప్రైవేటు ఎయిర్‌లైన్స్ ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే విమానాశ్రయం ప్రారంభం ఎంత ఉత్సాహాన్ని కలిగిస్తుందో, దానికి చేరుకునే రవాణా వ్యవస్థ అంతే ఆందోళనను కలిగిస్తోంది. ముఖ్యంగా విశాఖ నగరం నుంచి భోగాపురం వరకు సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ ట్రాఫిక్ పరిస్థితులను బట్టి గంటన్నర నుంచి రెండు గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ నగరవాసులకు ఎక్కువ ప్రయాణ సమయం :  ప్రస్తుతం విశాఖ నగరం నుంచి భోగాపురం చేరుకునేందుకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హనుమంతవాక, ఎండాడ, పీఎం పాలెం, మధురవాడ, కొమ్మాది, మారికవలస, ఆనందపురం మీదుగా వెళ్లే మార్గం ఎక్కువగా వినియోగంలో ఉంది. అయితే నగర ట్రాఫిక్ తీవ్రత కారణంగా ఈ మార్గంలో ప్రయాణిస్తే కనీసం గంటన్నర నుంచి రెండు గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. భీమిలి మార్గాన్ని ఎంచుకున్నా పరిస్థితిలో పెద్ద మార్పు ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. భీమిలి, ఆనందపురం మీదుగా భోగాపురం చేరుకోవడానికి కూడా గంటన్నరకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.

జాతీయ రహదారిపై ప్రయాణం కొంత సులువు :  అనకాపల్లి ప్రాంతం నుంచి భోగాపురం వెళ్లేవారికి జాతీయ రహదారి 16 కొంత ఉపశమనం కలిగించనుంది. అనకాపల్లి నుంచి బైపాస్ రహదారి ద్వారా ఆనందపురం చేరుకుని అక్కడి నుంచి భోగాపురానికి వెళ్లడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. దాదాపు 80 కిలోమీటర్ల దూరాన్ని గంటన్నర సమయంలో పూర్తి చేయవచ్చని అంచనా. స్టీల్‌ప్లాంట్, గాజువాక ప్రాంతాల నుంచి ప్రయాణించే వారు లంకెలపాలెం, సబ్బవరం మీదుగా ఎన్‌హెచ్-16ను చేరుకుని ఆనందపురం ద్వారా భోగాపురం వెళ్లవచ్చు. ఈ మార్గంలో కూడా సుమారు గంటా నలభై నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రత్యేక రహదారుల అవసరం : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో ప్రయాణికులకు ఉపయోగపడాలంటే ప్రత్యేక కనెక్టివిటీ రహదారులు అత్యవసరమనే అభిప్రాయం బలపడుతోంది. విమానాశ్రయానికి నేరుగా చేరుకునే వేగవంతమైన రహదారులు లేకపోతే ట్రాఫిక్ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టడంతో పాటు విమానాశ్రయానికి వెళ్లే మార్గాల్లో ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళిక అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

వీఎంఆర్‌డీఏ ప్రణాళికలపై ఆశలు :  భోగాపురం విమానాశ్రయాన్ని దృష్టిలో ఉంచుకుని వీఎంఆర్‌డీఏ ఇప్పటికే ఏడు కీలక రహదారులను ప్రతిపాదించింది. ఈ రహదారులు పూర్తయితే విశాఖ నగరం, భీమిలి, ఆనందపురం, అనకాపల్లి ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి చేరుకునే సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఊపు లభించనుండగా, రవాణా మౌలిక వసతుల అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విమానాశ్రయం విజయవంతంగా పనిచేయాలంటే రహదారి అనుసంధానం కీలక పాత్ర పోషించనుంది.