PEN POWER
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 5:29 pm Posted By : PEN POWER MEDIA

మేకపాటి కుటుంబంలో ఆస్తుల యుద్ధం..!

రాజకీయ కుటుంబంలో రోడ్డెక్కిన కుటుంబ కలహాలు
మీడియా ముందుకు వచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి
ఆస్తుల పంపకాలపై సోదరులపై ఆరోపణలు
రాజకీయ విభేదాలే కారణమా?
జగన్‌పై ఘాటు విమర్శలు
బహిరంగ చర్చకు సిద్ధమన్న మాజీ ఎమ్మెల్యే
నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మేకపాటి వివాదం
మేకపాటి కుటుంబంలో ఆస్తుల యుద్ధం..!
రాజకీయ కుటుంబంలో రోడ్డెక్కిన కుటుంబ కలహాలు

నెల్లూరు జిల్లాలో నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ ప్రస్థానం సాగించిన మేకపాటి కుటుంబంలో ఆస్తుల వివాదం బహిరంగానికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చి సోదరులపై తీవ్ర ఆరోపణలు చేయడంతో కుటుంబ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఆస్తుల పంపకాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని, వైసీపీని వీడి టీడీపీలో చేరిన తర్వాత పరిస్థితి మరింత సంక్లిష్టమైందని చంద్రశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెల్లూరు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

పొలిటికల్ బ్యూరో – పెన్ పవర్, నెల్లూరు, జూన్ 9:

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రభావశీల రాజకీయ కుటుంబాల్లో ఒకటిగా పేరొందిన మేకపాటి కుటుంబం ప్రస్తుతం ఆస్తుల వివాదాలతో వార్తల్లో నిలిచింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ కుటుంబంలో అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటపడటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తాజాగా మీడియా సమావేశం నిర్వహించి కుటుంబ ఆస్తుల పంపకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రావాల్సిన వాటాను సోదరులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు కుటుంబ పరిధిలోనే ఉన్న ఈ వ్యవహారం తొలిసారిగా ప్రజల ముందుకు రావడంతో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ మొదలైంది.

మేకపాటి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో విశేష రాజకీయ ప్రాధాన్యం ఉంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి పలు మార్లు పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించగా, చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మేకపాటి రాజగోపాల్‌రెడ్డి వైసీపీ తరఫున ఉదయగిరి నియోజకవర్గ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తుండగా, విక్రమ్‌రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ రాజకీయాలను పర్యవేక్షిస్తున్నారు.ఇలాంటి నేపథ్యంలో చంద్రశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కుటుంబంలో ఉన్న విభేదాల తీవ్రతను బయటపెట్టాయి. తనకు రెండు వివాహాలు జరిగాయనే కారణాన్ని చూపుతూ ఆస్తుల పంపకాన్ని నిరాకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కుటుంబ ఆస్తుల్లో తనకు రావాల్సిన హక్కు విషయంలో ఎన్నిసార్లు మాట్లాడినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ తన సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆస్తిలో తనకు వాటా ఇచ్చినట్లు ఆధారాలతో నిరూపిస్తే ఇకపై ఎలాంటి డిమాండ్లు చేయబోనని ప్రకటించారు. అవసరమైతే బహిరంగ చర్చకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కూడా చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన తర్వాత తనపై ఒత్తిళ్లు పెరిగాయని, ఆస్తుల వ్యవహారంలో కూడా రాజకీయ ప్రభావం పనిచేస్తోందని ఆరోపించారు. కుటుంబ నిర్ణయాల వెనుక జగన్ ప్రభావం ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలు, కుటుంబ విభేదాలు, ఆస్తుల పంపకాల వివాదం ఒకేసారి వెలుగులోకి రావడంతో మేకపాటి కుటుంబ వ్యవహారం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ప్రధాన రాజకీయ చర్చగా మారింది. ఈ ఆరోపణలపై మిగతా కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కుటుంబ వివాదం రాజకీయ ప్రభావం చూపుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.