పదేళ్లలో రెట్టింపైన కంది విస్తీర్ణం
వేరుశెనగ సాగుకు పెరుగుతున్న పెట్టుబడి భారం
గిట్టుబాటు ధరతో రైతులకు లాభాల బాట
రాయితీపై కంది విత్తనాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం
ప్రైవేట్ విత్తనాలపై రైతుల ఆసక్తి పెరుగుదల
పంటకాలం తక్కువ రకాలకే రైతుల ప్రాధాన్యం
వేరుశెనగకు వీడ్కోలు… కందికి రైతుల జైకొట్టు
రాయలసీమలో వ్యవసాయ పంటల సరళి వేగంగా మారుతోంది. ఒకప్పుడు లక్షల ఎకరాల్లో సాగైన వేరుశెనగ స్థానాన్ని ఇప్పుడు కంది ఆక్రమిస్తోంది. తక్కువ పెట్టుబడి, మెరుగైన ధర, ఆశాజనకమైన దిగుబడులతో రైతులు కంది సాగువైపు భారీగా మొగ్గు చూపుతున్నారు.
కర్నూలు, పెన్ పవర్, జూన్ 9:
రాయలసీమ వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు వేరుశెనగకు కేరాఫ్‌గా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పుడు కంది సాగుకు కేంద్రంగా మారుతోంది. నైరుతి రుతుపవనాల రాకతో ఖరీఫ్ సీజన్‌కు రైతులు సిద్ధమవుతున్న వేళ, అధిక శాతం మంది రైతులు కంది సాగుపైనే దృష్టి సారించడం విశేషం. పెట్టుబడి తక్కువగా ఉండటం, మార్కెట్‌లో మంచి ధరలు లభించడం, వాతావరణ పరిస్థితులకు కొంత మేర అనుకూలంగా ఉండటం వంటి అంశాలు రైతులను కంది వైపు ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు విత్తనాల సరఫరా ఏర్పాట్లు పూర్తి చేసింది. వేరుశెనగ సాగును ప్రోత్సహించేందుకు 2.20 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, రైతుల మొగ్గు మాత్రం కంది వైపే కనిపిస్తోంది. కంది విత్తనాలను 30 శాతం రాయితీపై 6,172 క్వింటాళ్ల మేర అందుబాటులో ఉంచింది. ఇవి లక్ష ఎకరాలకు సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కిట్ల రూపంలో పంపిణీ చేస్తే మరో 50 వేల ఎకరాలకు విత్తనాలు అందే అవకాశం ఉంది.
పదేళ్లలో పూర్తిగా మారిన పంటల పరిస్థితి : రాయలసీమలో పదేళ్ల క్రితం కంది సాగు కేవలం 2.75 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. అయితే 2025 నాటికి ఈ విస్తీర్ణం 5.59 లక్షల ఎకరాలకు పెరగడం గమనార్హం. మరోవైపు ఒకప్పుడు 22.58 లక్షల ఎకరాల్లో సాగైన వేరుశెనగ 2025 నాటికి కేవలం 5 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఈ గణాంకాలే రైతుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పును స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
వేరుశెనగ సాగుపై ఆసక్తి తగ్గడానికి కారణాలివే : వేరుశెనగ సాగుకు ఎకరాకు సగటున రూ.35 వేల వరకు పెట్టుబడి అవసరమవుతోంది. వర్షాభావం వచ్చినా, అధిక వర్షాలు కురిసినా దిగుబడులు ప్రభావితమవుతున్నాయి. తెగుళ్ల సమస్యలు కూడా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎకరాకు 2.5 నుంచి 4 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి రావడంతో పెట్టుబడికి తగిన లాభాలు అందడం లేదని రైతులు చెబుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి మళ్లిస్తున్నారు.
కందితో లాభాల బాట : కంది సాగుకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు మాత్రమే పెట్టుబడి అవసరమవుతోంది. సాధారణంగా ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా మంచి ఆదాయం లభిస్తోందని రైతులు చెబుతున్నారు. గత సీజన్‌లో కొందరు రైతులు ఎకరాకు 9 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించారు. ప్రస్తుతం కంది క్వింటాకు రూ.8,450 వరకు ధర లభించడం రైతుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.
ప్రభుత్వ విత్తనాలకు పరిమిత ఆదరణ : ప్రభుత్వం అందిస్తున్న కంది విత్తనాలు సుమారు 150 రోజుల పంటకాలం కలిగిన రకాలు. అయితే రైతులు తక్కువ వ్యవధిలో పంట వచ్చే ప్రైవేట్ కంపెనీల విత్తనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కిలో రూ.200 వరకు ధర ఉన్నప్పటికీ ఎకరాకు 6 కిలోల విత్తనాలు సరిపోవడం వల్ల వాటిని ఎంచుకుంటున్నారు. ప్రభుత్వమే తక్కువ పంటకాలం ఉన్న రకాలపై కూడా రాయితీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
భవిష్యత్తులో మరింత పెరగనున్న కంది సాగు : వ్యవసాయ నిపుణుల అంచనా ప్రకారం రాబోయే ఖరీఫ్‌లో కంది సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడితో పోలిస్తే ఆదాయం ఎక్కువగా రావడం, మార్కెట్‌లో స్థిరమైన డిమాండ్ ఉండటం, వాతావరణ మార్పులకు కొంత మేర తట్టుకునే సామర్థ్యం ఉండటం వల్ల రాయలసీమలో కంది రైతులకు ప్రధాన ఆదాయ పంటగా మారుతోంది. ఒకప్పుడు వేరుశెనగకు గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఇప్పుడు కంది సాగుకు కొత్త చిరునామాగా రూపాంతరం చెందుతోంది.