PEN POWER
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 4:57 pm Posted By : PEN POWER MEDIA

అనకాపల్లి జిల్లాలో ‘రియల్’ బూమ్ షురూ

రిశ్రమల జోరుతో భూములకు బంగారు రోజులు..
అనకాపల్లిపై పెట్టుబడిదారుల చూపు
పరిశ్రమల రాకతో పెరిగిన పెట్టుబడుల ప్రవాహం
నక్కపల్లి కేంద్రంగా పారిశ్రామిక విస్తరణ
పరవాడ – అచ్యుతాపురంలో హౌసింగ్ రంగం జోరు
సెమీ రింగ్ రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీతో కొత్త అవకాశాలు
భూముల ధరలకు రెక్కలు.. రిజిస్ట్రేషన్లలో రికార్డు వృద్ధి
విశాఖ–అనకాపల్లి జంట నగరాల దిశగా అడుగులు

ఉత్తరాంధ్రలో పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మారుతున్న అనకాపల్లి జిల్లా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. భారీ పరిశ్రమలు, మెరుగైన రవాణా మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో భూముల ధరలు వేగంగా పెరుగుతుండగా, పెట్టుబడిదారులు అనకాపల్లి వైపు ఆసక్తిగా చూస్తున్నారు.

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ , విశాఖపట్నం, జూన్ 9:

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని అనకాపల్లి జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఒకప్పుడు వ్యవసాయం, చెరకు, బెల్లం, మామిడి పంటలకు పేరుగాంచిన ఈ జిల్లా ఇప్పుడు పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్ రంగాల సమ్మేళనంగా రూపుదిద్దుకుంటోంది.

అనకాపల్లి జిల్లాలో ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, వారీ ఎనర్జీస్, లారస్ ల్యాబ్స్, బ్లూజెట్ హెల్త్‌కేర్, లిథియం అయాన్ సెల్ తయారీ యూనిట్లు వంటి భారీ పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో జిల్లా ఆర్థిక ముఖచిత్రం మారుతోంది. ముఖ్యంగా నక్కపల్లి ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటుండటంతో స్థానికంగా భూములపై డిమాండ్ అమాంతం పెరిగింది. పరిశ్రమల రాకతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్న అంచనాలు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరి పోశాయి. పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో భారీ స్థాయిలో అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌసింగ్ ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఎస్.రాయవరం, యలమంచిలి, పాయకరావుపేట మండలాల్లో కూడా స్థిరాస్థి వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది.

గతంలో రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పలికిన ఎకరా భూమి ధరలు ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కోటి రూపాయల మార్క్‌ను తాకుతున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లకు గిరాకీ పెరిగింది. పరిశ్రమల విస్తరణ కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రవాణా రంగంలో జరుగుతున్న అభివృద్ధి కూడా అనకాపల్లి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు ప్రతిపాదిత సెమీ రింగ్ రోడ్డు పూర్తయితే ఉత్తరాంధ్రలో రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ రహదారి ద్వారా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానం మరింత సులభమవుతుంది.

తుని–పాయకరావుపేట ప్రాంతంలో ప్రతిపాదిత ఎయిర్ స్ట్రిప్, జాతీయ రహదారి విస్తరణ, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి వంటి అంశాలు కూడా పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచుతున్నాయి. అనకాపల్లి–పాయకరావుపేట జాతీయ రహదారి వెంట ఇప్పటికే చిన్న, మధ్య తరహా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. విశాఖపట్నానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి భౌగోళికంగా కూడా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖ నగర విస్తరణ క్రమంగా అనకాపల్లి వైపు సాగుతుండటంతో భవిష్యత్తులో ఈ రెండు ప్రాంతాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నగరీకరణ వేగంగా పెరుగుతోంది.

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు కూడా జిల్లాకు అదనపు బలం చేకూరుస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతి, మెరుగైన రవాణా వ్యవస్థ, ఉపాధి అవకాశాల పెరుగుదల, భూములపై డిమాండ్ వంటి అంశాలు కలిసి అనకాపల్లిని భవిష్యత్తులో రాష్ట్రంలో అత్యంత కీలక పెట్టుబడి గమ్యస్థానంగా మార్చనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు జిల్లాలో అడుగుపెడితే అనకాపల్లి కేవలం పారిశ్రామిక కేంద్రంగానే కాకుండా రియల్ ఎస్టేట్ హబ్‌గా కూడా అవతరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూములు, గృహ ప్రాజెక్టులపై పెట్టుబడిదారులు ముందస్తు వ్యూహాలతో అడుగులు వేస్తుండటం జిల్లాలో ‘రియల్ బూమ్’కు సంకేతంగా కనిపిస్తోంది.