PEN POWER
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 5:27 pm Posted By : PEN POWER MEDIA

‘దేవాన్ష్ ఘాట్’ వివాదం వెనుక అసలు కథ ఇదే..!

  •  2015 నాటి బోర్డు.. 2026లో వైరల్..! 
  • గోదావరి తీరంలో రాజకీయ దుమారం
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘దేవాన్ష్ ఘాట్’
  • 2015 పుష్కరాల నాటి బోర్డేనని అధికారుల వివరణ
  • అప్పటి ఎమ్మెల్యే నిర్ణయంతో పేరు పెట్టిన ఘాట్
  • 1979 నుంచే ఉన్న పుష్కర ఘాట్‌కు సుదీర్ఘ చరిత్ర
  • మోడల్ ఘాట్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ యోచన
  • లోకేష్ ఆదేశాలతో బోర్డు తొలగింపు
     
    గోదావరి పుష్కరాల ఏర్పాట్ల మధ్య రాజానగరం సమీపంలోని ‘దేవాన్ష్ ఘాట్’ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఏర్పాటు చేసిన ఘాట్ కాదని, 2015 గోదావరి పుష్కరాల సమయంలోనే అప్పటి ప్రజాప్రతినిధుల నిర్ణయంతో బోర్డు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వివాదం చెలరేగిన వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందించి బోర్డును తొలగించాలని ఆదేశించగా, అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఘాట్ చరిత్ర, పేరు పెట్టిన నేపథ్యం, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు ఆసక్తికర చర్చకు దారితీశాయి.

రాజమండ్రి, పెన్ పవర్, జూన్ 9:

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ఘాట్ పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజానగరం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం మండలం మునికూడలి వద్ద ఉన్న ‘దేవాన్ష్ ఘాట్’ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చ సాగింది. ఈ ఘటనపై ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు వరుసగా స్పందించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, వీడియోల ద్వారా ‘దేవాన్ష్ ఘాట్’ పేరు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాన్ష్ పేరుతో ఘాట్ ఏర్పాటు చేశారంటూ ప్రచారం జరగడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి సంబంధిత బోర్డును తొలగించాలని అధికారులకు ఆదేశించారు. ఆదేశాల అనంతరం అధికారులు వేగంగా చర్యలు తీసుకుని బోర్డును తొలగించారు.అయితే ఈ వివాదం వెనుక ఉన్న వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ‘దేవాన్ష్ ఘాట్’ బోర్డు ఇటీవల ఏర్పాటు చేసినది కాదని, 2015 గోదావరి పుష్కరాల సమయంలోనే ఏర్పాటు చేసిన బోర్డేనని వారు స్పష్టం చేస్తున్నారు. అప్పటి రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ ఘాట్‌కు దేవాన్ష్ పేరు పెట్టినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.

నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులకు 2015 మార్చి 21న దేవాన్ష్ జన్మించారు. అదే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు నిర్వహించబడ్డాయి. ఆ సమయంలో ఏర్పాటైన ఘాట్‌లలో ఒకదానికి దేవాన్ష్ పేరు పెట్టి బోర్డు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన బోర్డు కూడా అదే కాలానికి చెందినదేనని అధికారులు వివరిస్తున్నారు.ఈ ఘాట్‌కు చరిత్ర కూడా తక్కువేమీ కాదు. స్థానికుల సమాచారం ప్రకారం 1979 గోదావరి పుష్కరాల సమయంలో ఈ ఘాట్‌ను అభివృద్ధి చేశారు. అనంతరం వివిధ పుష్కరాల సందర్భంగా మరమ్మతులు, విస్తరణ పనులు చేపట్టారు. అందువల్ల ఇది కొత్తగా ఏర్పడిన ఘాట్ కాదని స్థానికులు చెబుతున్నారు.

ఇటీవల గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా ఈ ఘాట్‌ను ఆదర్శవంతమైన పుష్కర ఘాట్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే పేర్కొనడం కూడా ఈ ఘాట్ మరోసారి వార్తల్లో నిలిచేందుకు కారణమైంది. జిల్లా కలెక్టర్ సైతం ఘాట్‌ను పరిశీలించి అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, పేరుపై వివాదం తలెత్తిన వెంటనే ప్రభుత్వం స్పందించడం, బోర్డు తొలగించడం ద్వారా రాజకీయ వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ‘దేవాన్ష్ ఘాట్’ వ్యవహారం గోదావరి పుష్కరాల ఏర్పాట్ల మధ్య మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది.