Homeఆంధ్రప్రదేశ్పోలవరంఇద్దరు యువకులు గల్లంతు. సోకులేరు వాగులో

ఇద్దరు యువకులు గల్లంతు. సోకులేరు వాగులో

చింతూరు వద్ద విషాదం

చింతూరు, పెన్ పవర్ జూలై 28:

ఏజెన్సీ ప్రాంతానికి విహారయాత్రగా వచ్చిన ఇద్దరు యువకులు సోకులేరు వాగులో ఈతకు దిగి గల్లంతయారు. తులసిపాక ఘాట్ రోడ్డులో ఉన్న తొలి వ్యూ పాయింట్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం విరంపాలెం గ్రామానికి చెందిన కల్యాణ్ (26), బాబు (21) తమ గ్రామానికి చెందిన మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సోకులేరు వ్యూ పాయింట్‌ను సందర్శించేందుకు వచ్చారు. ప్రకృతి అందాలను ఆస్వాదించిన అనంతరం సమీపంలోని సోకులేరు వాగులో ఈతకు దిగారు. ఈ సమయంలో నీటి లోతు అంచనా వేయలేక బాబు ఒక్కసారిగా మునిగిపోవడంతో అతడిని రక్షించేందుకు వరసకు బాబాయ్ అయిన కల్యాణ్ వెంటనే నీటిలోకి దూకాడు. అయితే నీటి లోతు, ప్రవాహం కారణంగా కల్యాణ్ కూడా బయటకు రాలేక ఇద్దరూ వాగులో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న చింతూరు సర్కిల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల సహాయంతో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చింతూరు సీఐ గోపాల్‌కృష్ణ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి లోతు తెలియని వాగులు, జలపాతాల్లో ఈతకు దిగకూడదని, ముఖ్యంగా పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో పర్యాటకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు మరోసారి హెచ్చరించారు. గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular