భోగాపురం ఎయిర్పోర్టు జగన్ హయాంలోనే కార్యరూపం దాల్చింది: ధర్మాన ప్రసాదరావు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితమేనని, ప్రస్తుత ప్రభుత్వం దానికి అనవసరంగా క్రెడిట్ తీసుకుంటోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్టుకు అవసరమైన భూసేకరణ, కేంద్ర అనుమతులు, ఫైనాన్షియల్ క్లోజర్, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ప్రక్రియలన్నీ జగన్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని పేర్కొన్నారు.
2023 మే 3న జగన్ శంకుస్థాపన చేసిన సమయంలోనే 2026 జూన్ నాటికి కమర్షియల్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ప్రకటించారని, అదే విధంగా ప్రాజెక్టు పూర్తయి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషకరమని అన్నారు. అయితే ఆ ఘనతను చంద్రబాబు ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడం సరికాదని విమర్శించారు.
భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ డెవలపర్ పెట్టుబడులు పెట్టిందని, జగన్ ప్రభుత్వం మాత్రం సుమారు రూ.1,200 కోట్లతో భూసేకరణ, పునరావాస ప్యాకేజీలు, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిందని వివరించారు.
విశాఖ నగరాన్ని భోగాపురం విమానాశ్రయంతో అనుసంధానించే యాక్సెస్ రోడ్డుకు జగన్ ప్రభుత్వమే కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించిందని, అయితే రెండేళ్లుగా ఆ రోడ్డు పనుల్లో ఎలాంటి పురోగతి లేదని కూటమి ప్రభుత్వాన్ని ధర్మాన విమర్శించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రాజెక్టులను పక్కనబెట్టి రాష్ట్ర నిధులను అమరావతికే పరిమితం చేస్తున్నారని ఆరోపించిన ఆయన, ఇలాంటి ధోరణి కొనసాగితే ప్రాంతీయ అసమానతలు పెరిగి భవిష్యత్తులో ప్రత్యేక ఉద్యమాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వంశధార ప్రాజెక్టు వివాదాన్ని పరిష్కరించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

