Homeఆంధ్రప్రదేశ్ఏలూరుఆ సబ్‌ రిజిస్ట్రార్‌ రూటే సెపరేటు..! అద్దెకు ఇల్లు ఇచ్చాడు.. చివరకు శవమై మిగిలాడు..!

ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ రూటే సెపరేటు..! అద్దెకు ఇల్లు ఇచ్చాడు.. చివరకు శవమై మిగిలాడు..!

  • అయ్యవారి బాగోతాలు – 4
  • అద్దెకు ఇల్లు ఇచ్చాడు.. చివరకు శవమై మిగిలాడు..!
  • నిడదవోలు అద్దె ఇంటి నుంచి మొదలైన వివాదం.. భీమడోలు వరకు సాగుతున్న ఆరోపణల నీడ
  • పత్రాలు ఎక్కడ..? కలప సామగ్రి ఏమైంది..?
  • ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిళ్లు వచ్చాయా..?
  • ‘‘ఏం చేయాలో అదే చేస్తా’’ అన్న బెదిరింపుల వెనుక నిజమెంత..?
  • ఇంటి యజమాని మృతి.. మిస్టరీగా మిగిలిన ప్రశ్నలు
  • ఆ మరణంపై సమగ్ర విచారణ జరిగితే.. మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి..?
  • లంచం లేకుండా రిజిస్ట్రేషన్లు జరగవన్న ఆరోపణలు.. సమగ్ర దర్యాప్తుకు బాధిత ప్రజల డిమాండ్‌

అద్దెకు ఇల్లు ఇచ్చాడు. ప్రభుత్వ అధికారి కాబట్టి పర్వాలేదనుకున్నాడు. తన ఇంట్లోకి వచ్చిన వ్యక్తిని నమ్మాడు. తన పొలం పత్రాలు రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చాడు , కానీ ఆ నమ్మకమే చివరకు తన కుటుంబానికి కన్నీటి కథగా మిగిలిందా..? ఇంటి నుంచి విలువైన కలప సామగ్రి మాయమైందని ఆరోపణలు. భూమికి సంబంధించిన కీలక పత్రాలు తీసుకెళ్లి తిరిగి ఇవ్వలేదన్న వాదనలు. దీనిపై అధికారులను ఆశ్రయించినా స్పందన లేదన్న ఆవేదన. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలు. ‘‘కేసు వెనక్కి తీసుకోకపోతే ఏం చేయాలో అదే చేస్తా’’ అన్నట్లుగా బెదిరింపులు ఎదురయ్యాయన్న బాధిత కుటుంబం వాంగ్మూలం. ఆ తర్వాత.. ఇంటి యజమాని మృతి. ఇది సాధారణ మరణమా..? లేక తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపులు, అవమానాలు, న్యాయం కోసం చేసిన పోరాటం మధ్య చోటుచేసుకున్న అనుమానాస్పద మరణమా..? ఇదే ఇప్పుడు అందరికీ మిస్టరీగా మారిన ప్రశ్న.

ఎడిటర్‌ పెన్‌ పవర్‌ ఏలూరు/భీమడోలు, జూలై 21:

వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వాసిరెడ్డి రాఘవేంద్ర ప్రసాద్‌పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గతంలో వేగేశ్వరపురం సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో నిడదవోలులోని అద్దె ఇంటిలో జరిగినట్లు చెబుతున్న వివాదం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. వివాహేతర సంబంధం, ఇంటి సామగ్రి చోరీ, భూమి పత్రాలు తీసుకెళ్లి తిరిగి ఇవ్వకపోవడం, ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు, అవినీతి ఆరోపణలు వంటి పలు అంశాలను ఇంటి యజమాని కుటుంబ సభ్యులు పెన్ పవర్‌ ఎదుట వెల్లడించారు. ఈ ఆరోపణలకు సంబంధించి నిడదవోలుకు చెందిన లేటు జొన్నకుడి ఎడ్వర్డ్‌ విజయరత్నం కుటుంబ సభ్యులు జిల్లా రిజిస్ట్రార్‌కు సమర్పించిన ఫిర్యాదు, బాధితురాలు జయమ్మ వెల్లడించిన వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ ఆరోపణలపై అధికారిక విచారణ జరిగి వాస్తవాలు నిర్ధారణ కావాల్సి ఉంది.

| అద్దె ఇంటి నుంచే వివాదానికి బీజం..? : ఇంటి యజమాని జొన్నకుడి ఎడ్వర్డ్‌ విజయరత్నం భార్య జయమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. వాసిరెడ్డి రాఘవేంద్ర ప్రసాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సమయంలో నిడదవోలులోని అల్లూరి సీతారామరాజు వీధిలో ఉన్న తమ ఇంటిని అద్దెకు తీసుకున్నారని తెలిపారు. అద్దెకు దిగే సమయంలో తాను తన భార్యతో కలిసి నివసిస్తానని చెప్పినప్పటికీ, అనంతరం శోభారాణి అనే మహిళతో కలిసి ఇంటిలో నివసించారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై తమ కుటుంబంలో వివాదం తలెత్తిందని, అనంతరం అద్దె ఇంటిలోని విలువైన కలప సామగ్రి, ఇతర వస్తువులు కనిపించకుండా పోయాయని జయమ్మ ఆరోపించారు. తమ కుటుంబానికి చెందిన పొలాల పత్రాలను కూడా తీసుకెళ్లి ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదని ఆమె వాపోయారు.

|‘‘పత్రాలు తీసుకెళ్లారు.. తిరిగి ఇవ్వలేదు’’ : తమ భూములకు సంబంధించిన కీలక పత్రాలు తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదని జయమ్మ ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అద్దె ఇంటిలో జరిగినట్లు చెబుతున్న చోరీపై కూడా జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులను ఆశ్రయించినా స్పందన లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత తమ కుటుంబంపై ఒత్తిళ్లు పెరిగాయని, ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వచ్చినట్లు ఆమె ఆరోపించారు.

|‘‘కేసు వెనక్కి తీసుకోకపోతే ఏం చేయాలో అదే చేస్తా’’ అన్నారా..? : తమ కుటుంబం చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని వాసిరెడ్డి రాఘవేంద్ర ప్రసాద్‌ నుంచి బెదిరింపులు వచ్చాయని జయమ్మ ఆరోపించారు. ‘‘కేసు వెనక్కి తీసుకోకపోతే ఏం చేయాలో అదే చేస్తా’’ అంటూ బెదిరించారని ఆమె పేర్కొన్నారు. ఈ బెదిరింపుల కారణంగా తన భర్త జొన్నకుడి ఎడ్వర్డ్‌ విజయరత్నం తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఆ తర్వాత ఆయన మరణించారని జయమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త మరణానికి ముందున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె కోరారు. అయితే, బెదిరింపుల కారణంగానే ఆయన మృతి చెందారనే ఆరోపణకు సంబంధించి అధికారిక దర్యాప్తు ద్వారా వాస్తవాలు నిర్ధారించాల్సి ఉంది.

| జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు.. అయినా చర్యలేవీ లేవా..? : అద్దె ఇంటిలో దొంగతనం జరిగిందంటూ ఇంటి యజమాని జొన్నకుడి ఎడ్వర్డ్‌ విజయరత్నం జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిర్యాదులో ఇంటి నుంచి వస్తువులు తీసుకెళ్లడం, పత్రాలు తిరిగి ఇవ్వకపోవడం వంటి అంశాలను ప్రస్తావించినట్లు వారు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత శాఖ నుంచి తగిన స్థాయిలో స్పందన రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? విచారణ జరిగిందా..? ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై శాఖాపరంగా ఏమైనా నివేదిక రూపొందించారా..? అన్న విషయాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి.

| అధికారిక విధుల్లోనూ అవినీతి ఆరోపణలు..? : ఇదిలా ఉండగా, వాసిరెడ్డి రాఘవేంద్ర ప్రసాద్‌ గతంలో అనంతపల్లి, వేగేశ్వరపురం ప్రాంతాల్లో పనిచేసిన సమయంలోనూ, ప్రస్తుతం భీమడోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. లంచం లేకుండా రిజిస్ట్రేషన్లు జరగడం లేదని, ప్రైవేట్‌ వ్యక్తుల ప్రమేయంతో కార్యాలయ వ్యవహారాలు సాగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మధ్యవర్తుల పాత్ర పెరిగిందని, సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి నిర్దిష్ట ఆధారాలు, అధికారిక విచారణ నివేదికలు వెలుగులోకి రావాల్సి ఉంది.

 

| విచారణకు ప్రజల డిమాండ్‌ : ఒక ప్రభుత్వ అధికారి చుట్టూ ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు, విజిలెన్స్‌ విభాగం తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. నిడదవోలు అద్దె ఇంటి వివాదం, ఇంటి సామగ్రి అదృశ్యం, భూమి పత్రాల వ్యవహారం, ఫిర్యాదు ఉపసంహరణకు వచ్చినట్లు చెబుతున్న బెదిరింపులు, ఇంటి యజమాని మృతికి ముందు జరిగిన పరిణామాలు, అలాగే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు—ఈ అంశాలన్నింటినీ విడివిడిగా కాకుండా సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలపై నిష్పక్షపాత దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆరోపణలు నిరాధారమైతే అదే విషయాన్ని అధికారికంగా స్పష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

| కొసమెరుపు ఏంటంటే : వాసిరెడ్డి రాఘవేంద్ర ప్రసాద్ పనిచేసిన ప్రతీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో ఒక ప్రైవేట్ మహిళ కీలక పాత్ర పోషిస్తుందనే గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఉన్నత అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే, అయితే ఈ అంశంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు. అభిప్రాయ డుతున్నారు. ఒకవేళ ఆరోపణల్లో నిజానిజాలు ఉంటే ప్రభుత్వం విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.”
అనంతపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఆంటీ… ఆ నలుగురు యవ్వారం… ఏంటో… చూద్దాం..? ఎపిసోడ్ 7 లో..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular