శ్వేతపత్రంలోని వ్యాఖ్యలపై ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం ఆగ్రహం
గంగవరం పెన్ పవర్, ఆగస్టు 9:
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను ప్రభుత్వ ఆర్థిక భారంగా చిత్రీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో చేసిన వ్యాఖ్యలను ఐక్య వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఉద్యోగులే ప్రభుత్వ ఆర్థిక సమస్యలకు కారణమన్నట్లుగా ప్రచారం చేయడం సరికాదని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.ఎ. రతన్ రాజ్ పేర్కొన్నారు.ప్రభుత్వ ఆదాయంలో 98 శాతం ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతోందన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన వాస్తవ గణాంకాలను ప్రజల ముందుంచకుండా, ఉద్యోగులపై అపోహలు కలిగించే విధంగా ప్రచారం చేయడం తగదన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి సేవలందిస్తున్నందుకు ఉద్యోగులు తమ శ్రమకు ప్రతిఫలంగా జీతాలు పొందుతున్నారని, “జీతం భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు” అని స్పష్టం చేశారు.ఉపాధ్యాయులు విద్యాబోధన, సచివాలయ ఉద్యోగులు సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ, వైద్య, పోలీస్, పంచాయతీరాజ్ తదితర శాఖల ఉద్యోగులు ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ ప్రభుత్వ పరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. అలాంటి ఉద్యోగులను ప్రభుత్వ ఆర్థిక భారంగా చూపించడం వారి సేవలను అవమానించడమేనన్నారు.
పీఆర్సీ, డీఏలు ఉద్యోగుల హక్కులు
ఎన్నికల సమయంలో ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ అమలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించిందని రతన్ రాజ్ విమర్శించారు. పీఆర్సీ ద్వారా వేతన సవరణ, డీఏ ద్వారా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆర్థిక ఉపశమనం కల్పించడం ఉద్యోగుల హక్కుల్లో భాగమన్నారు.ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల కుటుంబాల జీవన వ్యయం కూడా గణనీయంగా పెరిగిందని, నిత్యావసర వస్తువులు, విద్య, వైద్యం తదితర ఖర్చులు అధికమవుతున్న సమయంలో ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, ఇతర బకాయిలను నిలిపివేయడం అన్యాయమన్నారు. గత నాలుగేళ్లుగా సరెండర్ లీవుల చెల్లింపులు పెండింగ్లో ఉండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగులను బూచిగా చూపొద్దు
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి ఉద్యోగుల జీతాలే కారణమన్న భావనను ప్రజల్లో కల్పించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సంఘం ప్రకటించింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై నిజమైన శ్వేతపత్రం విడుదల చేయాలంటే ప్రభుత్వ మొత్తం వ్యయాలు, అప్పుల భారం, వివిధ ప్రాజెక్టుల ఖర్చులు, పన్ను ఆదాయం, పన్ను రాయితీలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమగ్ర వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేసింది.ఉద్యోగుల జీతాలను మాత్రమే ప్రస్తావించి వారినే దోషులుగా చూపించడం శ్వేతపత్రం కాదని సంఘం పేర్కొంది..ఉద్యోగుల హక్కుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో మరింత ఉధృతమైన ఉద్యమాన్ని చేపడతామని డి.ఎ. రతన్ రాజ్ హెచ్చరించారు. ఉద్యోగులను అవమానించడం, వారిపై నిందలు మోపడం మానుకుని వారి హక్కులను ప్రభుత్వం గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు.

