విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి ఘటనను నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ , సీనియర్ వైసీపీ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు ఖండించారు. ఈ సందర్భంగా గణేష్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలనుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టిడిపి నాయకుడు చంద్రబాబే ఇలాంటి కుట్ర పన్నాడని ఆరోపించారు. గతంలోనూ విశాఖలో కత్తితో దాడి చేశారని, ఇప్పుడు మరలా విజయవాడలో రాళ్లదాడికి పాల్పడ్డారని అన్నారు. ఇదంతా బూటకమని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కొట్టి పారేస్తున్నారని, గతంలో చంద్రబాబుకు జరిగిన అలిపిరి ఘటన కూడా అలాంటిదేనా అని ప్రశ్నించారు. విమర్శలు చేసే ముందు మీరు ఒకసారి కత్తితోనో , రాయితోనో కొట్టించుకుంటే ఆ నొప్పి తెలుస్తుందని, ప్రజాభిమానం విపరీతంగా ఉన్న జగన్ లాంటి నాయకులకు ఇలాంటి డ్రామాలు అక్కరలేదని అన్నారు. సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇలాంటి సంఘటన దురదృష్టకరమన్నారు. వైసిపి ప్రభుత్వం మరల ఏర్పడే అవకాశం ఉండడంతో జగన్ రెడ్డిని తప్పించాలని టిడిపి నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజాదరణ కలిగిన నాయకులను ఎవరు ఆపలేరని, ఇలాంటి కుతంత్రాలు ఎన్ని పన్నినా జగన్ ముఖ్యమంత్రి కాక తప్పదని అన్నారు. ఆదివారం జరిగిన అనేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గణేష్ మరియు ఇతర నాయకులు నల్లబ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేశారు.