కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరుగుతున్న పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ శనివారం సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జగ్గంపేట మండలం విద్యా కానుక పాయింట్, రిజిస్టర్లను, నాడు-నేడు లో భాగంగా జగ్గంపేటలో పది కాంపోనెంట్స్ వర్క్స్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ మాట్లాడుతూ ఏసీఆర్ఎస్ పనులు వర్షాకాలం వస్తున్న తరుణంలో వేగవంతం చేయాలని మెటీరియల్స్ పాడవకుండా చూసుకోవాలని సూచించారు. ఏసిఆర్ఎస్ కి ఫండ్స్ తక్కువ వస్తే వేరే మండలం నుంచి తీసుకొస్తామన్నారు. అంతేకాకుండా స్కూలు రీఓపెనింగ్ ముందు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించే విధంగా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పాఠశాల తెరిచేనాటికి నాడు-నేడు మెటీరియల్స్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా శుభ్రం చేయించాలన్నారు. స్కూల్ సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంఈఓలు ఆర్ స్వామి, ఎ.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు, ఇంజనీర్లు, సచివాలయ ఇంజనీర్లు, మండల విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.