సార్వత్రిక ఎన్నికలను సమీపిస్తున్న నేపథ్యంలో బరిలో నిలుస్తున్న అభ్యర్థుల ప్రచార సరళి ప్రజలకు ఒకింత ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలుస్తున్న ఇరువురు అభ్యర్థులు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నిర్వహిస్తుండగా క్షేత్రస్థాయిలో నెమ్మదిగా సాగుతున్న నేపధ్యంలో అభ్యర్థులు ఆశించినంతగా చేయడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయం ఉండడంతో ఇప్పటి నుంచే ప్రజల్లో ఎక్కువ శాతం తిరిగితే అభ్యర్థుల వ్యయం ఎక్కువవుతుందని ఆందోళనలతోనే ఈ రకమైన ప్రచారానికి అభ్యర్థులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచార తీరు ఎన్నికల సమయంలో గోడ మీద పిల్లలుగా ఉండే మండల స్థాయి, గ్రామస్థాయి నాయకులకు రుచించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రచారం జోరుగా జరిగితే స్థానికంగా వారి హవా ఉండటంతో పాటు వారి నుంచే నగదు లావాదేవీల వ్యవహారం జరుగుతూ ఉండేది. ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలో జోరుగా ప్రచార నిర్వహించకపోవడంతో కీలకమైన నాయకులు వారి స్వంత అభ్యర్థులపైనే సెటైర్లు వేస్తున్నారు. పక్కాగా గెలుస్తుంది అనుకున్న సీటు కాస్త పోటా పోటీగా మారుతుందని అసత్య అభిప్రాయాలను వారి స్నేహితుల ద్వారా మౌత్ పబ్లిసిటీ చేయడంతో పాటు వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెట్టిస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రచారానికి భిన్నంగా నేటి ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరుతో గ్రామాల్లో ఎన్నికల సందడి లేకుండా పోతుంది. గతంలో గ్రామ, మండల స్థాయి నాయకులు ఎవరికి వారే స్వచ్ఛందంగా ఇంటింటికి ప్రచారం చేస్తూ తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను ప్రసన్నం చేసుకునే వాళ్ళు కానీ నేడు నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం ఇంటింటి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి వస్తే తప్ప గ్రామ, మండల స్థాయి నాయకులు ఎవరు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. రాష్ట్రంలోనే హార్ట్ టాపిక్ గా మారిన గన్నవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు . తెలుగుదేశం, బిజెపి, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు పోటీపడుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చుకు వెనకాడకుండా డబ్బును నీళ్ల ప్రవాహం లాగా ఖర్చు చేస్తారని భావించిన ద్వితీయ శ్రేణి నాయకులకు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం తీరు వారిని డీలా పడేలా చేసింది. ఎన్నికల సమయంలో తమ హవాను చూపించడంతోపాటు గ్రామాల్లో చక్రం తిప్పుదామని భావించే కీలక నాయకులు సైతం ప్రస్తుత ప్రచారంలో పాల్గొనపోవడానికి అభ్యర్థుల ఆశించిన స్థాయిలో నగదును ఖర్చు చేయకపోవడమే ప్రధాన కారణం తెలుస్తుంది. యార్లగడ్డ వెంకట్రావు తరపున ఆయన భార్య జ్ఞానేశ్వరి, తమ్ముడు సతీష్ ప్రచారం చేస్తుండగా వల్లభనేని వంశీ మోహన్ ఒక్కడే ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం నామినేషన్ల స్వీకరణ అనంతరం ప్రచార సరళిలో మార్పులు చోటుచేసుకుంటాయో లేదో వేచి చూడాలి.
సోషల్ మీడియాలో జోరుగా క్షేత్రస్థాయిలో నెమ్మదిగా
విజయవాడ రూరల్, న్యూస్ డెస్క్ పెన్ పవర్
గన్నవరం నియోజవర్గంలో అభ్యర్ధుల ప్రచారం తీరు