మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా బాలినేని పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఆయన ఉక్కపోతకు గురవుతున్నారు. తనకు ఏ మాత్రం గౌరవం లభించడం లేదని ఆయన కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింద. అయితే చివరి క్షణంలో జగన్ బుజ్జగించడంతో ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. అయితే ఆయన ఘోరపరాజయం పాలయ్యారు. ఆ తర్వాత తాను ఈవీఎంల వల్లే ఓడిపోయానని పోరాటం చేశారు. ఈవీఎంల చెకింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోర్టుల్లోనూ కేసులు వేశారు. అయితే పార్టీ నుంచి కనీసం సపోర్టు లేదని.. జగన్ పట్టించుకోవడం లేదని అసంతృప్తి ప్రకటనలు చేశారు. ఇటీవల జగన్ తో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. కానీ పార్టీలో మార్పులు తాను అనుకున్నట్లుగానే జరుగుతాయని.. ఒంగోలు అసెంబ్లీలో మాత్రమే పని చేసుకోవాలని.. ఇక ఎక్కడా కల్పించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తిరుపతికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తారని అంటున్నారు. ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడంపై కూడా.. బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఆయన మాట వినలేదు. బాలినేని పార్టీ మారడం ఖాయమని తేలడంతో.. బుజ్జగించేందుక పార్టీ నేతలు విడదల రజనీ.. రామసుబ్బారెడ్డిలను ఆయనతో చర్చలకు పంపారు. అయితే బాలినేని మాత్రం వెనక్కి తగ్గలేదు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరని బాలినేని తన రాజీనామా లేఖలో తెలిపారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు జగన్ ను అడ్డుకున్నానని .. ఎలాంటి మొహమాటలకు పోలేదన్నారు. అంతిమంగా ప్రజా తీర్పును ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందేనన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా... రెండు సార్లు మంత్రిగా చేశానన్న తృప్తి ఉందన్నారు. రాజకీయాల్లో భాష హందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం చేశానని విలువల్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి తన దగ్గరకు వచ్చినా సాయం చేస్తానని బాలినేని లేఖలో పేర్కొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారన్నదానిపై ఇంత వరకూ స్పష్టత లేదు. త్వరలో అనుచరులతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలుస్తానని చెప్పారు. బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు. అయితే మరో బంధువు వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉన్నారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటంలో వైఎస్ జగన్ సుబ్బారెడ్డికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇది కూడా బాలినేని అసంతృప్తికి కారణం అయిందని భావిస్తున్నారు.