మిర్చి పంటకి తెగుళ్లు.. రైతుకు కన్నీళ్లు

వైరస్ దెబ్బతో విలవిల

చీడపీడల దాడితో దిక్కుతోచని స్థితితో తగ్గనున్న దిగుబడులు

మిరప పంటకు ఆకుముడుత వ్యాప్తి

పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 14:ఈ ఏడాది మంచి దిగుబడితో అధిక లాభాలు తెచ్చిపెడుతుందని ఆశించిన మిర్చి రైతులకు బొబ్బార వైరస్ తో అపార నష్టం తెచ్చిపెట్టింది.ఆకు ముడత తెగుళ్ళు కారణంగా పుల్లల చెరువు మండలంలో మిర్చి రైతుల కంట కన్నీరు కారుతోంది. గత ఏడాది ధరలు బాగా ఉండటంతో పుల్లల మండలంలో మిర్చిని విస్తారంగా సాగు చేశారు. మరికొద్ది రోజుల్లో కోతకు వచ్చి మంచి దిగుబడులు వస్తాయనుకున్న తరుణంలో ఇప్పుడిప్పుడే ప్రబళం అవుతున్న ఆకు ముడత తెగుళ్ళుతో రైతులను కోలుకోలేని దెబ్బతీస్తుంది.తెగుళ్ళ దెబ్బకి బంకా చిన్న వెంకటయ్య రైతు తన ముడేకరాల మిరప పంటను ట్రాక్టర్ తో దున్నేస్తున్నా సంఘటన పుల్లల చెరువులో వెలుగు చూసింది. మిరప మొక్కలు పై తెగుళ్లు దాడి చేయడంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 *ఎన్ని మందులు కొట్టినా అదుపులోకి రాని తెగులు* 

మిరప మొక్కలు బొబ్బర తెగుళ్ళు సోకి చెట్లు ఆకులు ముడుచుకుపోయి పసుపు రంగుగా మారి రాలిపోతున్నాయి.ఆకుముడత తెగులు నుంచి దక్కించుకునేందుకు రైతులు మార్కెట్‌లో ఉన్న మందులన్నింటినీ పిచికారీ చేస్తున్నారు. ఖర్చు పెరుగుతుందే కానీ తెగుళ్లు అదుపులోకి రావడంలేదు. ముడత పూర్తిగా నిర్మూలించే మందు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఎకరా మిరపకు కౌలు, దుక్కి,మిరపనారు,నాటుకూలి, అరకలు,కలుపు కూలి,ఎరువులు, పురుగుమందులు కలిపి ఎకరాకు 90వేల నుంచి లక్ష వరకు ఖర్చు చేశారు.

తెగుళ్ల దెబ్బకు అదనంగా పెట్టుబడి

అన్ని అనుకూలంగా ఉంటే ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. మిర్చి పంట ఆరు నెలల వరకు మూడు కాపులు ఇస్తుంది. అందులో 1, 2 కాపులో పచ్చి మిర్చి మీద క్వింటాకు 7వేల వరకు ఆదాయం వచ్చేది. మూడో కాపు ఎండు మిర్చికి క్వింటా ధర 18వేల వరకు లభిస్తుంది. వైరస్ కారణంగా తెగుళ్లు సోకడంతో పంటను దక్కించుకునేందుకు అదనంగా 30 నుంచి 50వేల వరకు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

*భారీగా తగ్గనున్న దిగుబడులు* 

సాధారణంగా ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడులు రావాల్సి ఉండగా, ఈ తెగుళ్లతో 6, 7 క్వింటాలు కూడా దిగుబడులు రావని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఆకు ముడత తెగుళ్ళు వచ్చిన పోలాలు రైతులు దున్నేస్తున్నారు.ప్రభుత్వమే ఆదుకుని నష్టపరిహారం అందించాలనీ రైతులు కోరుతున్నారు.

About The Author: A YESEBU