సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన పోలీస్ అబ్జర్వర్ హసీబ్ ఉర్ రెహమాన్.. ఐపీఎస్
ఒంగోలు
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం, కె. పల్లెపాలెం మరియు ఈతముక్కలలోని పలు పోలింగ్ కేంద్రాలను శనివారం పోలీస్ అబ్జర్వర్ సందర్శించి ఆయా కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు, భౌగోళిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలు మరియు ఇతర అంశాలను పరిశీలించి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన భద్రతా చర్యలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు తెలియచేసారు.ఎన్నికలు పారదర్శకంగా,సజావుగా జరగడానికి పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు, బారికేడింగ్ మరియు ఇతర ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రతాపరమైన లోపాలు, అవరోధాలు ఉన్న వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని, తన ఫోన్ నెంబర్ 9281034495 కు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఫోన్ చేసి ఫిర్యాదులు తెలపవచ్చని పోలీసు పరిశీలకులు తెలియజేశారు.పోలీస్ అబ్జర్వర్ వెంట కొత్తపట్నం ఎస్సై సాంబశివరావు మరియు సిబ్బంది ఉన్నారు.