ఢల్లీి, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా అన్ని మెట్రో సిటీస్ వరద బాధిత నగరాలే. ఎందుకంటే నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది. ప్రైమ్ లొకేషన్ లో గజం దొరికినా చాలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో కొందరు నాలాలు, చెరువుల భూముల్ని కబ్జా చేయడం మొదలు పెట్టారు. అందుకే హైదరాబాద్ సహా మెట్రో నగరాలది ఇదే పరిస్థితి. మన హైదరాబాద్ విషయానికే వద్దాం. భాగ్యనగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. 1925 నాటికి భాగ్యనగర జనాభా నాలుగున్నర లక్షలు మాత్రమే. 1950 నాటికి 10 లక్షల దాకా చేరుకుంది. ఇప్పుడు కోటి దాటిపోయింది. మరి సౌకర్యాలు ఇంకెంత పెరిగి ఉండాలి. ఎప్పుడో నిజాం కాలం నాటి డ్రైనేజీలే ఇంకా వాడడంతోనే హైదరాబాద్ కు తరచూ ఈ సమస్య వస్తోంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు గత పాలకులు సరైన చర్యలు తీసుకోకపోవడం, కార్యాచరణ రెడీ చేసినా అవి ముందుకు జరగకపోవడంతో సమస్యలు పెరిగి ఇదిగో ఇలా రోడ్లే చెరువులుగా మారిపోయిన సీన్ కనిపిస్తోంది, ఓ స్టడీ ప్రకారం హైదరాబాద్ లో 5 శాతం జనాభాకు వరదలతో హైరిస్క్ ఉంటోంది. ఏకంగా 93 శాతం జనాభాకు మధ్యస్థంగా ఫ్లడ్ రిస్క్ ఉంటోంది. ఇక కేవలం 2 శాతం జనాభాకే లో రిస్క్ ఉంది. అంటే సిటీలో మెజారిటీ జనాభాకు వరద ముప్పు ఉంది. ఇళ్లల్లోకి నీరు చేరడం, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం, ఫలితంగా ట్రాఫిక్ జామ్ అవడం.. ఇలా అంతా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు హైడ్రా చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. మరి నాలాలపై అక్రమ నిర్మాణాల విషయంలోనూ అదే స్పీడ్ చూపుతారా అన్న చర్చ సిటీ జనాల్లో పెరుగుతోంది. ఎందుకంటే అంతా గట్టిగా అనుకుంటేనే మార్పుకు నాంది పడుతుంది. అలా జరిగినప్పుడే సిటీ జనాభా పెరిగినా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎవరి పని వాళ్లు చేసుకునే వీలు కలుగుతుంది. లేదంటే ఇదిగో ఇంకెన్నాళ్లైనా ఇలాగే ఉంటుంది..హైదరాబాద్ లో చిన్న చినుకులకే వ్యవస్థ ఆగమైపోతోంది. కేవలం 2 సెంటీవిూటర్ల వర్షపాతాన్ని తట్టుకునే డ్రైనేజీ వ్యవస్థ మన దగ్గర ఉంది. చాలా చోట్ల మురుగు నీళ్లు, వరద వెళ్లేందుకు ప్రత్యేక వ్యవస్థలు లేవు. రెండూ ఒకే ప్రవాహంలో వెళ్లడమే. అసలు హైదరాబాద్ పరిస్థితి వానాకాలంలోనే తెలుస్తుంది. సిటీలో 10 సెంటీవిూటర్లకు పైగా ఏకధాటిగా వర్షం కురిస్తే అంతేసంగతి మరి. ఇది ఈ ఒక్కరోజులో జరిగింది కాదు. జనాభా విపరీతంగా పెరుగుతున్నా అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోలేదు. ఎక్కడికక్కడ భవన నిర్మాణాలు పెరగడంతో ఫీడర్ చానళ్లు మూసుకుపోయాయి. చెరువులు, కుంటలు, ఫీడర్ చానెల్స్ ధ్వంసం కావడంతో నీళ్లన్నీ రోడ్లపైనే పారుతున్నాయి. హైటెక్ హంగులతో డెవలప్ అయిన మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లోనూ గంటకు రెండు సెంటీవిూటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకునే డ్రెయిన్స్ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎక్కడ రోడ్లపై వర్షం నీళ్లు నిలిచినా.. గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ లు హైదరాబాద్ లో కామన్ అయ్యాయి. గంటలు గడిస్తే గానీ డెస్టినేషన్ చేరుకోలేని దుస్థితి.హైదరాబాద్ లో వస్తున్నదంతా నదీప్రాంత వరదే కాదు. అంతాకూడా అర్బనైజేషన్ ఎఫెక్టే అంటున్నారు. నగరీకరణ వరదలకు మరో ప్రధానకారణమంటున్నారు. హైదరాబాద్ అంటే లేక్ సిటీ అని పేరుండేది. ఒకప్పుడు సిటీకి నీటిని అందిస్తూ భూగర్భ జలాన్ని కూడా పెంచిన ఎన్నో చెరువులు ఇవాళ నీటితో కాక ఇళ్లతో నిండి ఉండడం చూస్తూనే ఉన్నాం. హైడ్రా అనే వ్యవస్థ వచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చుతున్నదీ చూస్తున్నాం. అయితే ఇదే హైడ్రా స్పీడ్ నాలాల దాకా వస్తుందా అన్నది కీలకంగా మారింది. రాజధానిలో భూముల విలువ విపరీతంగా పెరగడంతో నాలాలు, చెరువులే రాజ మార్గంగా కబ్జా దార్లకు కనిపిస్తున్నాయి. దీంతో చెరువుల్లోకి వెళ్లాల్సిన వర్షపు నీరు రోడ్లపైకి, ఇండ్లల్లోకి చేరి నగరాన్ని ముంపు ముంగిట్లోకి తెచ్చాయి.3700 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మురుగునీటిపారుదల వ్యవస్థ ఆధునీకరణ చేయడంలో మాత్రం విఫలమైంది. స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కూడా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 625 చదరపు కిలోవిూటర్లు. జనాభా కోటి దాటింది. నగరంలో రోజూ 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 700 మిలియన్ లీటర్ల మురుగు నీటిని జలమండలి ఎస్టీపీల్లో శుద్ధి చేస్తోంది. మిగతా మురుగు నీరు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే సవిూప చెరువులు, మూసీలో కలుస్తోంది. గ్రేటర్ పరిధిలో 1500 కిలోవిూటర్ల మేర విస్తరించిన నాలాలపై వేలాదిగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఈ నాలాలను సమూలంగా ప్రక్షాళన చేయాలంటున్నారు. విస్తరించాలి కూడా.నాలాల ఆధునీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం, ఇందుకోసం రాజకీయ పార్టీలు, ఎన్జీఓల సహకారం తీసుకోవడం కూడా ముఖ్యంగానే మారింది. కానీ నాలాలపై అక్రమ నిర్మాణాలను కూల్చుదామంటే మొదట అడ్డొచ్చేది పొలిటిషీయన్లే అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉండేది వారి ఓటర్లు.. లేదంటే వారి అనుచరగణం ఉండడమే కారణం. ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న ఉద్దేశంతో కూల్చివేతలకు ఇన్నాళ్లూ వెనుకడుగు వేశారు. కానీ ఇకపై సిటీలో సీన్ ఎలా ఉంటుందన్నదే చూడాలి,ప్రజలకు మేలు జరిగే పని కావాలంటే పాలకుడు పకడ్బందీగా ఉండాలి. కఠిన నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. అందరినీ ఒప్పించాలి. మెప్పించాలి. అప్పుడే సమస్యల నుంచి శాశ్వత విముక్తి దొరుకుతుంది. హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలపై ప్రస్తుతం హైడ్రా దూకుడు పెంచింది. అలాగే నాలాల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. వరద నీటిని మురుగునీటిని తరలించే నాలాలు అంతకంతకూ కుంచించుకుపోయాయి. వాటిపై అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో కాస్త గట్టిగా వర్షం పడితే నాలాలు పొంగి, రోడ్లు, లోతట్టు కాలనీలను ముంచెత్తుతున్నాయి.