నిజాంపేట్ కార్పొరేషన్..! కమలంలో "కీచులాట"..!

కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీష్ టార్గెట్‌గా.. ఏకమైన పార్టీలోని సీనియర్లు..

కబ్జాలపై పోరాటమే కొంప ముంచుతుందని అంటున్న క్యాడర్..

కార్పొరేషన్ కమిటీని నీరుగార్చేలా గ్రామ కమిటీల ఏర్పాటు..

కమలం పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్న ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..

బీజేపీలో గ్రూపులకు కారణం అవుతున్న.. పార్టీలో చేరిన బీఆర్ఎస్ మాజీలు..

గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాల పర్వంపై బీజేపీ పోరాటం..

ఇటీవలే గెస్ట్‌హౌస్ కబ్జా కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  తండ్రికి కోర్టు నోటీసులు..

కుత్బుల్లాపూర్ నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీలో ముసలం..గతంలో  బీఆర్ఎస్‌ గ్రూప్ రాజకీయాలకు తెరలేపిన కొందరు నేతలే..! ఇప్పుడు బీజేపీ చేరి గ్రూపులకు కారణమవుతున్నారా..? కార్పొరేషన్‌కు మాత్రమే అధ్యక్షుడిగా ఉన్న ఆకుల సతీష్‌పై..! బీజేపీ సీనియర్‌లు తీసుకున్న నిర్ణయం వెనుక చక్రం తిప్పుతున్నది ఎవరు..? ప్రజల ఆస్తులని కాపాడేందుకు సతీష్ పాటుపడటాన్ని సీనియర్‌లకు ఎందుకు తప్పనిపించింది..?పార్టీ నిబంధనలకు విరుద్దంగా సీనియర్‌లు వ్యవహరిస్తున్నారని, సతీష్ ఆరోపణలపై పార్టీ పెద్దలు ఏం చర్యలు తీసుకోబోతున్నారు..? ప్రభుత్వ ఆస్తుల కబ్జాలపై కొందరు నేతల వసూళ్ళకు ఆటంకం ఏర్పడిందా..? అందుకే బీజేపీలో ముసలం నెలకొన్నది అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, జూలై 11:


నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ కమిటీకి విరుద్దంగా 
మూడు గ్రామాల అధ్యక్షుల నియామకం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..! ప్రస్తుత అధ్యక్షుడు ఆకుల సతీష్‌పై కుట్రలో భాగమేనని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.. మరోవైపు ఎవరికి తెలియకుండా పార్టీ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా రాష్ట్రస్థాయి నాయకులు నిజాంపేట్ బిజెపిని గ్రామాల వారిగా విడదీయడం వెనుకపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. బిజెపి అధ్యక్షుడు ఆకుల సతీష్‌ టార్గెట్‌గా సీనియర్‌ నాయకుల పనే అంటూ ఆకుల సతీష్ ఆరోపిస్తున్నారు.. బిజెపి పార్టీ గ్రామాల విభజన వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధి, బడా బిల్డర్‌లు, ఓ బిజెపి ప్రజాప్రతినిధి తెరవెనుక నుండి నడిపిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. బిజెపి పార్టీ రాజ్యాంగబద్ధం ప్రకారం కార్పొరేషన్‌లో గ్రామాల అధ్యక్షులు నిబంధనలకు విరుద్ధం అంటూ సతీష్ ఆరోపణ.. పార్టీ నిబంధనల ప్రకారం కాదని, కేవలం సీనియర్ నాయకులే బిజెపి  గ్రామ అధ్యక్షుల నాటకానికి తెరలేపినట్టు ఆయన ఆరోపించారు.. బీజేపీ పార్టీని నిర్వీర్యం చేసే చర్యలంటూ, బిజెపి సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలల్లో రాష్ట్ర జిల్లా మండల నూతన కమిటీల నియామకం ఉన్న నేపథ్యంలో..! ఈ హడావిడి ఏమిటని ఆగ్రహం.. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేని గ్రామ కమిటీలు నిజాంపేట కార్పొరేషన్‌లో  ఎందుకని పార్టీ పెద్దలు చర్చించినట్లు సమాచారం..

గ్రామాల వారీగా కమిటీలు వేస్తే..! నిజాంపేట కార్పొరేషన్ కమిటీ ఏంటి..?

గ్రామాల వారిగా పార్టీని విడదీయడంలో సీనియర్ నాయకుల పన్నాగం ఏంటని ఆకుల సతీష్ ప్రదర్శించారు.. అవినీతి అక్రమాల ఫిర్యాదులపై, సీనియర్ నాయకులు చెప్పినట్లు వినకపోవడమే ఈ విభజన కారణమా..? వెంటనే మూడు గ్రామాల అధ్యక్షులు విభజన ప్రకటన విరమించుకోకుంటే కార్పొరేషన్ కమిటీ సభ్యుల మూక్కుమ్మడి రాజనామాలు చేసేందుకు సిద్దమైనట్టు అధ్యక్షుడు ఆకుల సతీష్ గురువారం ప్రకటన జారీ చేశారు..
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో బిజెపి కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కమిటీ వివిధ మోర్చాల కమిటీలు..! పార్టీ నియమ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయకుండా..! పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, మొన్నటి ఎంపీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీన్ సాధించి ప్రథమ స్థానంలో ఉండేందుకు శ్రమించి నప్పటికీ..! కుత్బుల్లాపూర్ పరిధిలోని కొత్తగా వచ్చిన నాయకులు, మరియు జిల్లా రాష్ట్రస్థాయి సీనియర్ నేతలం అని చెప్పుకునే కొందరు ఈ వ్యవహారానికి తెరలేపినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.. దీని వెనుక మరో ప్రజా ప్రతినిధి సహకారంతో పాటు, పరోక్షంగా బిఆర్ఎస్ ప్రజాప్రతినిధిల ప్రోద్బలం ఉందని ఆరోపించారు.. 

బీజేపీని లేకుండా చేసే కుట్రలో భాగమే..!

గత రెండు సంవత్సరాలుగా నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్ష పీఠంలో ఉన్న సతీష్‌ను తొలగించడానికి ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో..! చివరి అస్త్రంగా కార్పొరేషన్ కమిటీ ఉనికే లేకుండా చేయడానికి నిజాంపేట్ కార్పొరేషన్‌ని, బాచుపల్లి, నిజాంపేట్ ,ప్రగతి నగర్ గ్రామాలుగా విడదీసే కుట్రలో భాగమేనని ఆకుల సతీష్ ఆరోపించారు.. కార్పొరేషన్ పరిధిలోని సీనియర్ నాయకులను, కార్పొరేషన్ కమిటీని సంప్రదించకుండానే ఏకపక్షంగా పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా నిన్న రాత్రి దొంగ చాటుగా బాచుపల్లి గ్రామానికి మరియు ప్రగతి నగర్ గ్రామానికి అధ్యక్షుల ప్రకటన చేయడంపై నిజాంపేట్ కార్పొరేషన్ బిజెపి కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేషన్ని మళ్లీ గ్రామాలుగా ఏ విధంగా విడదీస్తారని ,గ్రామ కమిటీ అధ్యక్షులని ఏ విధంగా నియామకం చేస్తారని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు.. 

*కుత్బుల్లాపూర్‌లో నిజాంపేట్ కార్పొరేషన్ బిజెపి పార్టీ పనితీరుతో ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నప్పటికీ..! బీజేపీలో సీనియర్ నాయకులుగా చెప్పుకునే కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కార్పొరేషన్‌లో కమిటీని నిర్వీర్యం చేయడంపై నిజాంపేట్ బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. శుక్రవారం ఉదయం 9 గంటలలోపు కార్పొరేషన్‌‌లో గ్రామాల వారీగా విభజన, గ్రామ అధ్యక్షుల ప్రకటన, వెనుకకు తీసుకోకపోతే.. పది గంటలకి కార్పొరేషన్ సంబంధించిన బిజెపి నాయకులు తమ తమ పదవులకి రాజనామ చేసి, నిరసన తెలుపుతామని హెచ్చరించారు..*

*నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీలో కీచులాటకు అసలు కారణాలు ప్రధానంగా.. నిజాంపేట్ సర్వే నెంబర్ 283 పట్టాభూమిలో నిర్మాణ అనుమతులతో..!సర్వే నెం. 233/13, 15 ప్రభుత్వ భూమిలో అక్రమంగా అపార్ట్‌మెంట్‌ నిర్మాణపై సతిష్ కలెక్టర్‌కు ఫిర్యాదు,..! మల్లంపేట్ లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌లో ప్రభుత్వ భూమి, కేవిఆర్ లేఅవుట్‌లో పార్కుస్థలాలు కబ్జా చేస్తూ.. పోర్జరీ సంతకాలతో తప్పుడు రిజిస్ట్రేషన్‌‌లపై సతీష్ ఫిర్యాదు.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గెస్ట్‌హౌస్ కబ్జాపై పలుమార్లు ప్రెస్‌మీట్, ఎమ్మెల్సీ తండ్రికి హైకోర్టు నోటీసులు.. వీటన్నిటిపై ఆకుల సతీష్ ఫిర్యాదు చేసినందుకే.. కొందరు నేతల వసూళ్ళకు అడ్డంకిగా ఉన్నందుకు అధ్యక్షుడిగా తొలిగించే కార్యం తలపెట్టినట్లు స్పష్టమవుతుంది.. కార్పొరేషన్ కాబట్టి కంట్రోల్‌లో ఉన్నాని, అదిలేకున్నా ప్రజా క్షేత్రంలో ఫైట్ చేయడానికి అడ్డులేదని సతీష్ తెలిపారు..*

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.