పార్కుస్థలాలకు.. రిజిస్ట్రేషన్‌‌లు..

దుండిగల్ మున్సిపల్ బౌరంపేట్ సింహపురి కాలనీలో ఈ తతంగం..

సంక్షేమ సంఘాల కనుసన్నల్లోనే అంటూ ఆరోపిస్తున్న స్థానికులు..

దుండిగల్‌ మున్సిపాలిటీ బౌరంపేట్ సింహపురి కాలనీలో పార్కుస్థలం విక్రయించి రిజిస్ట్రేషన్..

కమిషనర్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదు దారులు..

"ఏ-122 అపార్ట్‌మెంట్‌ పక్కనే పార్కుస్థలంగా గ్రామ పంచాయతీ హయాంలోనే హెచ్చరిక బోర్డు..

సింహపురి కాలనీ సర్వే నెంబర్ 442, 443 "ఏ బ్లాక్‌లో" పార్కుస్థలం 111.80 గజాలు విక్రయం..

డి-బ్లాక్‌లో ప్లాట్ నెం.333, 334 పక్కనే మరో 450 గజాలు విక్రయించినట్లు స్థానికుల సమాచారం..

డి-బ్లాక్‌లోనే టెంపుల్ కాంప్లెక్స్ పేరుతో మరో పార్కుస్థలం కబ్జాకు సిద్దం అంటున్న స్థానికులు..

 

బౌరంపేట్ సింహపురి కాలనీలో పార్కుస్థలాలకు రిజిస్ట్రేషన్‌‌లు..

 

ఓవైపు ‌"హైడ్రా" చర్యలతో హైదరాబాద్ మహానగరం వణికి పోతుంటే..! మరికొందరు కబ్జాదారులకు భయం లేకుండా పోతోంది.. లేఅవుట్‌లోని పార్కుస్థలాలు బహిరంగంగా విక్రయిస్తున్నారు.. 1996లో సుమారు 100 ఎకరాల పైచిలుకు లేఅవుట్‌‌లో 6 బ్లాక్‌లతో నిర్వాహకులు వెంచర్ పూర్తిచేశారు.. అనంతరం 2006లో అసోసియేషన్ ఫామ్ చేసినట్లు కాలనీ ప్రజలు చెబుతున్నదే.. 6 బ్లాక్‌లకు ఎక్కడికక్కడ పార్కుస్థలాలు కేటాయించారు.. కాలక్రమేణా పెరుగుతున్న రియల్ భూమ్‌తో కబ్జాకు కాదేది అనర్హం అన్న చందంగా..! సదరు లేఅవుట్‌లోని పార్కుస్థలాలపై కొందరు అసోసియేషన్ పెద్దల కన్నుపడి తాజాగా విక్రయాలు జరుపుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు.. ఈనెల 24న దుండిగల్‌ కమిషనర్ కె.సత్యనారాయణకి కాలనీ వాసులు ఫిర్యాదు చేసి వినతిపత్రం అందజేశారు.. నాలుగు రోజులైనా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు..

 

 మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఆగష్టు 27:

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, దుండిగల్‌ మున్సిపల్ పరిధి బౌరంపేట్ సింహపురి కాలనీలోని పార్కుస్థలాలు విక్రయిస్తున్నారని, ఈనెల 24న దుండిగల్‌ మున్సిపల్ కమిషనర్‌ కె‌.సత్యనారాయణకి వినతిపత్రం అందజేశారు.. బౌరంపేట్ సింహపురి కాలనీలోని ఏ-బ్లాక్‌లో 122వ ప్లాట్ అపార్ట్‌మెంట్‌‌కు అనుకుని ఉన్న సుమారు 700 గజాల పార్కుస్థలంలో, గ్రామపంచాయతి హయాంలోనే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.. ఆహ్లాదకరమైన వాతావరణంలో,కాలనీ వాసులు కూర్చునేందుకు ఆర్ఎంసి చైర్‌లు ఏర్పాటు చేశారు.. హెచ్చరిక బోర్డును తొలగించి "ఫ్రీ కాస్ట్" వాల్ కూడా నిర్మించి యదేచ్చగా కబ్జా చేయడం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.. సదరు పార్కు స్థలాన్ని కాపాడాలని అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గత 24వ తేదీన,  బీజేపీ ఆధ్వర్యంలో సింహపురి కాలనీవాసులు దుండిగల్ కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు.. కమిషనర్ స్పందించి పార్కుస్థలం కబ్జాపై తక్షణమే చర్యలు చేపట్టాలని టౌన్‌ప్లానింగ్ అధికారికి ఆదేశించినట్లు కాలనీ వాసులు తెలిపారు.. 

పార్కు స్థలానికి‌ గిఫ్ట్ రిజిస్ట్రేషన్..

బౌరంపేట్ సింహపురి కాలనీ సర్వే నెం.442, 443 ఏ-బ్లాక్‌లో 122 ప్లాట్ పక్కనే ఉన్న పార్కుస్థలంలో కొంత భాగం,111.80 గజాలు విభజించి 122/1 గా దయాకర్ రెడ్డి అనే వ్యక్తి, శ్రీరాములు అనే వ్యక్తికి గత నెలలో (2024 జులై) లో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినట్లు స్థానికులు డాక్యుమెంట్‌ చూపించారు.. వెంచర్ నిర్వాహకులు, ఒక్కో బ్లాక్‌లో ఎంత విస్తీర్ణంలో పార్కుస్థలాలు ఉన్నాయో 6 బ్లాకుల్లోని పార్కుస్థలాల వివరాలను బోర్డుపై స్పష్టంగా తెలియజేశారు.. సింహపురి కాలనీ మొత్తం అపార్ట్‌మెంట్‌లతో ఉన్నందున, కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి కేటాయించిన పార్కుస్థలాలు కబ్జాకు గురైతే..! భవిష్యత్తులో పరిస్థితి ఏమిటని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.. తాము పార్కు స్థలాలను చూసిన తర్వాతే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేశామని,ఇప్పుడు పార్కుస్థలాలు విక్రయించడం ఏంటని కాలనీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు..

సింహపురి కాలనీ "డి-బ్లాక్‌లోనూ"..

బౌరంపేట్ సింహపురి కాలనీ 6 బ్లాకులుగా వెంచర్ ఏర్పాటు చేశారు.. అయితే ప్రతి బ్లాకులో కేటాయించిన పార్కు స్థలాల్లో ఎన్ని పార్కులు, ఎన్ని గజాలు అన్న వివరాలను బోర్డుపై ఉంచారు.. "డి-బ్లాక్‌లో" 4 పార్కులకు గాను, 5334 గజాల స్థలం కేటాయించినట్లు స్పష్టంగా ఉంది.. డి-బ్లాక్‌లో ప్లాట్ నెంబర్ 333, 334 పక్కనే ఉన్న సుమారు 450 గజాల స్థలంలో ఉన్న పార్కుస్థలం బోర్డును తొలగించి చదును చేశారు.. స్థానికులు పార్కుస్థలాల కబ్జాలను మీడియా దృష్టికి తీసుకువచ్చారు.. డి-బ్లాక్‌లోనే  మరోచోట ఉన్న పార్కుతొలగించి "శ్రీ గణపతి పార్కుగా" బోర్డు ఏర్పాటు చేయగా..! అదే స్థలంలో పాత బోర్డును తొలగించి కొత్తగా "శ్రీ గణపతి టెంపుల్ కాంప్లెక్స్"గా నూతన బోర్డు ఏర్పాటు చేయడంపై డి-బ్లాక్‌ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.. సదరు పార్కుస్థలాన్ని అభివృద్ధి చేయకుండా టెంపుల్ కాంప్లెక్స్ పేరుతో కమర్షియల్ చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు..

బౌరంపేట్ సింహపురి కాలనీ 6 బ్లాక్‌ల పార్కుస్థలాల వివరాలు (బోర్డుపై ఉన్నది ఉన్నట్లు) కాలనీలో మొత్తం 6 బ్లాకులకు గాను.. ఏ-బ్లాక్‌లో 2 పార్కులకు 2628 గజాలు కేటాయించగా.. బి-బ్లాక్‌లో '0' ఏమి లేనట్టు చూపించారు.. సి-బ్లాక్‌లో 1 పార్కు స్థలానికి‌ 513 గజాలు.. డి-బ్లాక్‌లో 4 పార్కు స్థలాలకు గాను 5334 గజాలు కేటాయించారు.. ఇ-బ్లాక్‌లో 2 పార్కులకు 5040 గజాలు కేటాయించారు.. ఎఫ్-బ్లాక్‌లో 1 పార్కు స్థలానికి 2208 గజాల స్థలం కేటాయిస్తూ..! మొత్తం 10 పార్కుల జాబితాను బోర్డుపై ఉంచారు.. అయితే మరికొన్ని పార్కు స్థలాలు కూడా ఆక్రమణకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.. వాటిపైన అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు..

 

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.