ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ చౌకబారు పనులకు పాల్పడుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రోజున పి.గణేష్ పేరుతో నామినేషన్ వేయించారని, ఒకే పేరుతో ఉండడంవల్ల ఓట్లు చీలుతాయనే అయ్యన్నపాత్రుడు ఉద్దేశపూర్వకంగా ఈ నామినేషన్ వేయించారని పెట్ల గణేష్ ఆరోపించారు. శుక్రవారం ఉదయం 13 వ వార్డులో ఆయన గడపగడపలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మీడియాతో మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడుకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే తన పేరుతో పోలికలు ఉన్న మరొక వ్యక్తి చేత నామినేషన్ వేయించారని, దీనివల్ల ఓట్లు చీలుతాయనే కుటిల ఆలోచన అయ్యన్నపాత్రుడు చేశాడని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. 30 వేలకు పైగా మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.