నల్గోండ, పెన్ పవర్ మార్చి 18:
పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య జరుగుతున్న ఒక కీలకమైన పోరాటంకు నల్లమల ప్రజలు సిద్ధమవుతున్నారు. తమ ఉనికి కే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెను ప్రమాదం పొంచివుందని స్పష్టం చేస్తున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు అనుమతి ఇచ్చింది. నల్లమల అడవిలోని కుంచోని మూల నుంచి పదర వరకు మొదటి బ్లాక్లో 38 చదరపు కిలో విూటర్లు, పదర నుంచి ఉడిమిల్ల వరకు రెండో బ్లాకులో మరో 38 చదరపు కిలోవిూటర్ల విస్తీర్ణంలో నాలుగు వేల బోర్లు వేసి, నమూనాలు సేకరించేందుకు భారత అణుశక్తి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు అనుమతులు రావడంతో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు ఎగువభాగంలో అచ్చంపేట, అమ్రాబాద్ అటవీశాఖ అధికారులు,అణు సిబ్బంది కలిసి వారం రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. డ్రిల్లింగ్యంత్రాలు తీసుకు వచ్చేందుకు రూట్మ్యాప్ సిద్ధం చేశారు. నల్లమల అభయారణ్యం లో యురేనియం అన్వేషణ, వెలికితీత కు ప్రత్యేక హెలిక్యాప్టర్ లు రంగంలోకి దింపారు. సవిూప గ్రామాల ప్రజలకు తెలియకుండానే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.
ఆలస్యంగా తెలుసుకున్న అ ప్రాంత ప్రజలు పచ్చని అడవిలో విధ్వంసం సృష్టించొద్దంటు పోరాటానికి పిలుపు నివ్వడంతో యూరినియం నిక్షేపాల వెలికితీత అంశంకు తాత్కాలిక బ్రేక్ పడిరది. నల్లమల అడవులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి తూర్పు కనుమల్లో భాగం. ఇక్కడ అరుదైన వృక్ష, జంతు జాతులు ఉన్నాయి. ఈ అడవుల్లో చెంచు గిరిజనులు నివసిస్తున్నారు. ఈ అడవులు కృష్ణా నదికి నీటిని అందించే ప్రధాన వనరు. నాగార్జున సాగర్ డ్యామ్ కు ప్రధాన నీటి వనరు ఈ అడవులే. ఇక్కడ యురేనియం తవ్వకాలు జరిగితే, ఈ అడవులు, గిరిజనుల జీవనం, కృష్ణా నదిపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో పడతాయి.’’ యురేనియం వెలికితీత ఈ ప్రాంత జీవ వైవిధ్యానికి, తెలుగు జాతికి, ప్రజల ఆరోగ్యంపై కూడా ఎన్నటికీ తీరని చేటు చేస్తుందని స్థానికుల అందోళన చెందుతున్నారు.