ఫోన్‌ ట్యాపింగ్‌ కథ కంచికేనా..?

the-phone-tapping-story-is-closed..?


హైదరాబాద్‌, పెన్ పవర్  ఫిబ్రవరి 15, 
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుకు ఊరట లభించింది. పలు దఫాలుగా విచారణ చేపట్టిన నాంపల్లి సెషన్స్‌ కోర్టు ప్రణీత్‌రావుకు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రణీత్‌రావు చంచల్‌గూడ జైలులో  రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై లాయర్‌ ఉమామహేశ్వరరావు ఫిబ్రవరి 11న ప్రతీణ్‌ రావు తరఫున వాదనలు వినిపించారు. స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సాంబశివారెడ్డి విచారణకు హాజరుకాకపోవడంతో పీపీ వాదనల కోసం విచారణ నేటికి వాయిదా వేశారు. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇతర నిందితులకు కోర్టులు బెయిల్‌ ఇచ్చాయని, ప్రస్తుతం ప్రణీత్‌ రావు ఒక్కరై జైలులో ఉన్నాయని లాయర్‌ ఉమామహేశ్వర రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ అడిషినల్‌ ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ ప్రభాకర్‌ రావులకు తెలంగాణ హైకోర్టు జనవరి 31న మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. మరో నిందితుడిగా ఉన్న అడిషనల్‌ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని వాదనలు వినిపించారు. ప్రణీత్‌ రావు బెయిల్‌ పిటిషన్‌ పై ఇరువైపుల వాదనలు విన్న జడ్జీ జస్టిస్‌ రమాకాంత్‌ రెగ్యూలర్‌ బెయిల్‌ మంజూరు చేశారు. బెయిల్‌ మంజూరు కావడంతో ప్రతీణ్‌ రావు త్వరలో విడుదల కానున్నారని ఆయన లాయర్‌ ఉమామహేశ్వరరావ తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతిపక్షనేతలైన కాంగ్రెస్‌, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌ అయినట్లు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే దర్యాప్తు మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని దర్యాప్తులో తేలింది. ఎస్‌ఐబీలో ఉన్న 17 కంప్యూటర్లలో మొత్తం 42 హార్డ్‌ డిస్క్‌ లను తొలగించి.. వాటి స్థానంలో కొత్తవి అమర్చారు ప్రణీత్‌ రావు. పోలీస్‌ విచారణలో ప్రణీత్‌ రావు ఈ విషయాన్ని అంగీకరించారని అధికారులు తెలిపారు. మూసీ నదిలో నాలుగో బ్రిడ్జి కింద హార్డ్‌ డిస్క్‌ సంబంధించి శకలాలు గుర్తించారు. తమ వివరాలు తెలిసిపోతాయని హార్డ్‌ డిస్కులు ధ్వంసం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్ని సీరియస్‌ గా తీసుకుని ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మాజీ ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావును మొదట అరెస్ట్‌ చేసింది. విచారణలో తెలిసిన సమాచారం ఆధారంగా అనంతరం అడిషనల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను సైతం పోలీసులు అరెస్ట్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు సినీ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖుల ఫోన్లు సైతం ట్యాపింగ్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాప్‌ చేసి వారికి సంబంధించిన రాజకీయ, వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారని విచారణలో ఒక్కో విషయం వెల్లడవుతోంది. అయితే ఈ కేసులో ఒక్కొక్కరిగా టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు, ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నలకు కోర్టులు బెయిల్‌ మంజూరు చేశాయి. తాజాగా ప్రణీత్‌ రావుకు నాంపల్లి సెషన్స్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

About The Author: Admin