నర్సీపట్నం, పెన్ పవర్ :
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో నర్సీపట్నం నియోజకవర్గంలో మూడో స్థానంలో ఓట్లు సంపాదించుకుంటానని స్వతంత్ర అభ్యర్థి బైపురెడ్డి భద్రాచలం ఆశాభావం వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో ప్రముఖ న్యాయవాది బైపురెడ్డి భద్రాచలం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను భవిష్యత్తు నాయకత్వం కోసం ప్రయత్నిస్తున్నానని, ప్రస్తుతం ఇంటికొక ఓటు పాదరక్షలు గుర్తుపై వేసి నన్ను నాయకుడిగా నిలబెట్టాలని వినూత్నశైలిలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు మండలాల్లో ప్రజలతో మమేకమయ్యానని, తన అభ్యర్థనపై సానుకూల స్పందన వస్తుందని అన్నారు. అయ్యన్నపాత్రుడును వైసిపి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిన కారణo వల్ల ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలలో ప్రభుత్వం పట్ల భయంతో ఉన్నారన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు ఉన్నారని, భవిష్యత్తు నాయకునిగా ఎదగాలనే ఉద్దేశంతోనే తాను నామినేషన్ వేశానన్నారు. ఇకపై ప్రజల్లోనే ఉంటానని, ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నర్సీపట్నంలో ఎన్నికల వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యాయవాది భద్రాచలం అన్నారు. ఎవరిపైనా కోపంతో తాను ఎన్నికలలో నిలబడలేదని, తనని తాను నాయకుడిగా నిరూపించుకునే ప్రయత్నమేనని అన్నారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కన్నా తనకే ఎక్కువ ఓట్లు వస్తాయని, మూడోస్థానం తనదేనంటూ బైపురెడ్డి బద్రాచలం ధీమా వ్యక్తం చేశారు.