PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 11:59 pm Posted By : PEN POWER MEDIA

తిరుపతిలో దారుణం… రెండున్నరేళ్ల చిన్నారి హత్య..!

  • కుటుంబ కలహాలే విషాదానికి కారణమా
  • సహజీవనం నేపథ్యం విచారణలో కీలకం
  • రెండున్నరేళ్ల పాప ప్రాణాలు బలి
  • మిస్సింగ్ ఫిర్యాదు మలుపు తిప్పింది
  • తల్లిపై పోలీసులు అనుమానాలు
  • ఫోన్ ట్రాకింగ్‌తో వెలుగులోకి నిజాలు
  • వివాహేతర సంబంధం కోణంలో దర్యాప్తు
  • ఖననం చేసిన ప్రాంతంలో తవ్వకాలకు సిద్ధం
  • నగరంలో కలకలం రేపిన ఘటన
  • పూర్తి వివరాల కోసం పోలీసుల విచారణ కొనసాగింపు
  • తల్లి చేతిలోనే పసిపాప ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన

క్రైమ్ బ్యూరో పెన్ పవర్, తిరుపతి, ఫిబ్రవరి 24:

తిరుపతి నగరంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. రెండున్నరేళ్ల సొంత కూతురిని తల్లి హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టిన సంఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి కీలక విషయాలు వెలికితీస్తున్నారు.

ఘటన వివరాలు: తిరుపతి ఆటోనగర్ ప్రాంతానికి చెందిన నాగరత్నమ్మ–రంగా దంపతులకు ఆశాలత అనే కుమార్తె ఉంది. ఆశాలతకు రాజేష్‌తో వివాహం జరిగింది. వీరికి దుర్గ అనే రెండున్నరేళ్ల పాప జన్మించింది. అయితే భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఆశాలత తన కూతురు దుర్గతో కలిసి పోస్టల్ కాలనీలో నివాసం ఉంటోంది.

వివాహేతర సంబంధం కోణం : పోలీసుల ప్రాథమిక విచారణలో చెన్నై గుంట హరిజనవాడకు చెందిన రెడ్డి కుమార్‌తో ఆశాలతకు సాన్నిహిత్యం ఏర్పడి సహజీవనం కొనసాగించినట్టు సమాచారం.
తనను పెళ్లి చేసుకోవాలంటే చిన్నారి దుర్గ అడ్డు అవుతోందని రెడ్డి కుమార్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘోర చర్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మిస్సింగ్ ఫిర్యాదు ద్వారా వెలుగులోకి : ఈ నెల 19వ తేదీ నుండి మనవరాలు కనిపించడంలేదని నాగరత్నమ్మ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగరత్నమ్మ తన కుమార్తె ఆశాలతను ఫోన్ ద్వారా పాప గురించి అడిగినప్పుడు పొంతనలేని సమాధానాలు రావడంతో అనుమానం బలపడింది.

ఫోన్ సిగ్నల్ ఆధారంగా అదుపులోకి : ఆశాలత ఫోన్ సిగ్నల్‌ను ట్రాక్ చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో చిన్నారిని హత్య చేసి పూడ్చిపెట్టినట్టు ఒప్పుకున్నట్టు సమాచారం.

ఘటన స్థల పరిశీలన : పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. చీకటి కావడంతో తవ్వకాలు వాయిదా వేసి, బుధవారం ఖననం చేసిన ప్రాంతాన్ని తవ్వి మృతదేహాన్ని వెలికితీసేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది.