9 జిల్లాల క్రీడాకారుల పాల్గొనడం విశేషం
కాజులూరు, పెన్ పవర్,మార్చి 22:
కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో చందాల మల్లి బాబు ఆధ్వర్యంలో ఆదినారాయణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన జోనల్ స్థాయి శరీర సౌష్టవ పోటీలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పోటీలకు 9 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు హాజరుకాగా, యువత కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలను తిలకించారు.కార్యక్రమ ప్రారంభానికి ముందు వాసంశెట్టి సత్యం, పోలిశెట్టి చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ అక్కల రేశ్వంత్, తాడి రామారెడ్డి, చుండ్రు వీర్రాజు చౌదరి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో ఇలాంటి శరీర సౌష్టవ పోటీలు నిర్వహించడం సాధారణ విషయం కాదని అన్నారు. యువతను ఆరోగ్యవంతమైన జీవనశైలికి దారితీసే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. 9 జిల్లాల నుంచి క్రీడాకారులు రావడం పోటీల స్థాయిని చాటుతుందని నిర్వాహకులను అభినందించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సనపల ధనరాజు మాట్లాడుతూ శరీర సౌష్టవం ఆరోగ్యానికి ప్రతీక అని, ఈ క్రీడాకారులు సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. తబ్బా సెక్రటరీ ఓడపల్లి శ్రీనివాసరాజు మాట్లాడుతూ దాతలు ముందుకొస్తే ఇటువంటి పోటీలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు.
పోటీల్లో తొలి దశగా క్రీడాకారుల సౌష్టవ ప్రదర్శన నిర్వహించగా, న్యాయనిర్ణేతలు ఐదుగురిని ఫైనల్‌కు ఎంపిక చేశారు. వారిలో 48వ నంబర్ క్రీడాకారుడు విజేతగా నిలిచి ప్రథమ బహుమతిని అందుకున్నారు. ఆయనకు వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా నగదు బహుమతి, ట్రోఫీ అందజేశారు. మిగిలిన విజేతలకు కోట తాతబ్బాయి, తాడి రామారెడ్డి, చుండ్రు వీర్రాజు చౌదరి తదితరులు మెమెంటోలు, నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ పోటీలలో కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను 10 విభాగాల్లో నిర్వహించగా, ప్రతి విభాగంలో మొదటి మూడు స్థానాలకు రూ.3000, రూ.2000, రూ.1000 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు. అదనంగా “చాంపియన్ ఆఫ్ చాంపియన్స్” బిరుదును కూడా ప్రకటించారు.ఇండియన్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అనుబంధ సంస్థలైన ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్, గోల్డెన్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, చందాల ఆదినారాయణ ట్రస్ట్, దక్ష జిమ్, సాలిడ్ ఫిట్‌నెస్ (కాకినాడ) సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించాయి.ఈ కార్యక్రమంలో కంచుమర్తి బాబురావు, రిక్కల రిశ్వంత్ రాయ్, అంగర కృష్ణ తదితర ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొని విజేతలను అభినందించారు.