PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 11:08 am Posted By : PEN POWER MEDIA

అందుబాటులోకి రానున్న నేషనల్ హైవే 565

  •  నేషనల్ హైవే 565 పూర్తి – ప్రయాణికులకు ఊరట
  •  తెలంగాణ–ఏపీ మధ్య కీలక రహదారి
  • నకిరేకల్ నుంచి ఏర్పేడు వరకు విస్తరణ
  • NH-65, NH-71లను కలిపే కీలక మార్గం
  • యర్రగొండపాలెం వద్ద 20 కిమీ రోడ్డు విస్తరణ
  • అటవీ ప్రాంతంలో సురక్షిత ప్రయాణం
  • 50 నిమిషాల ప్రయాణం 20 నిమిషాలకు తగ్గింపు
  • రూ.393 కోట్లతో భారీ నిర్మాణం
  • వంతెనలు, అండర్‌పాస్‌లతో సౌకర్యం
  • తిరుపతి, హైదరాబాద్ ప్రయాణానికి కొత్త ప్రత్యామ్నాయం

తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే కీలక రహదారి అయిన నేషనల్ హైవే 565 పూర్తిగా అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న కష్టమైన మార్గాలు ఇప్పుడు సులభతరమై, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది.

ఒంగోలు, పెన్ పవర్, మార్చి 24:

తెలుగు రాష్ట్రాల మధ్య రవాణాను మరింత సులభతరం చేసే నేషనల్ హైవే 565 నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఈ హైవేపై వాహనాలు సాఫీగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ హైవే తెలంగాణలోని నకిరేకల్ నుంచి ప్రారంభమై, ఆంధ్రప్రదేశ్‌లోని ఏర్పేడు వరకు విస్తరించి ఉంది. ఇది హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65)ను, మదనపల్లె–నాయుడుపేట రహదారి (NH-71)తో కలుపుతుంది.ఈ మార్గం ద్వారా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే వారికి ఇది ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతోంది.ప్రత్యేకంగా యర్రగొండపాలెం సమీపంలో 20 కిలోమీటర్ల రోడ్డును విస్తరించడం కీలకంగా మారింది.

ఈ భాగం అటవీ ప్రాంతంలో ఉండటంతో గతంలో ప్రయాణం కష్టంగా ఉండేది.పుల్లలచెరువు నుంచి వెల్దుర్తి వరకు రోడ్డు పరిస్థితి దారుణంగా ఉండటంతో 50 నిమిషాలు పట్టే ప్రయాణం, ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లో పూర్తవుతోంది.ఈ రోడ్డును అభివృద్ధి చేయడానికి సుమారు రూ.393 కోట్లు ఖర్చు చేశారు. అటవీ ప్రాంతం కావడంతో కొండలు, లోయల మధ్య ప్రయాణానికి అనువుగా 16 వంతెనలు, 8 అండర్‌పాస్‌లు నిర్మించారు.మొదట్లో అటవీ అనుమతులు ఆలస్యం కావడంతో పనులు నిలిచిపోయాయి. అయితే 2024లో అనుమతులు రావడంతో పనులు వేగంగా పూర్తి చేశారు.ఈ హైవే నల్గొండ, మాచర్ల, మార్కాపురం, కనిగిరి, పామూరు, రాపూరు, వెంకటగిరి వంటి కీలక ప్రాంతాలను కలుపుతోంది. మార్కాపురం జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్లే  వారికి ఈ రహదారి ఎంతో సౌకర్యంగా మారింది.మొత్తం 420 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ హైవేలో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఏర్పేడు వద్ద నుంచి శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు.