PEN POWER
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 10:19 am Posted By : PEN POWER MEDIA

‘అడ్డు’ తొలిగింది.. ‘రోడ్డు’ పడింది..

“బాచుపల్లి-మల్లంపేట్‌” నడుమ 5 కిలోమీట‌ర్లు త‌గ్గిన ప్ర‌యాణ దూరం..!

కోర్టు ఉత్త‌ర్వులు ప్ర‌కారం అడ్డుగోడ‌ను తొల‌గించిన హైడ్రా..
ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్-4 నిర్మాణంతో మల్లంపేట్‌‌లో ట్రాఫిక్ జామ్‌లు..
అడ్డుగోడ తొల‌గిస్తే 3 కిలోమీట‌ర్లేనట.. లేదంటే 8 కిలోమీట‌ర్లు ప్రయాణం..
మల్లంపేట్ ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు నక్షలో ఉన్నప్పటికీ నిర్మాణానికి జాప్యం..
ప్రణీత్ అంటీలియా వెంచర్ నిర్మాణ దశలో అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం..
అధికారుల విధుల నిర్వహణ నిర్లక్ష్యం నేడు సమస్యగా మారిన వైనం..

మల్లంపేట్‌- బాచుపల్లి నడుమ 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రహదారి ఉన్నప్పటికీ, దుండిగల్‌ టౌన్‌ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం 40 ఫీట్ల రోడ్డుకే పరిమితమైంది.. గత బీఆర్ఎస్ హయాంలో చోట నాయకునికి కూడా అధికార యంత్రాంగం దాసోహం గురించి అందరికీ తెలిసిందే..! రోడ్లను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలకు, స్థానిక నేతల సిఫార్సులు, దుండిగల్‌ మున్సిపల్ నిధులు రూ.7.5 లక్షలతో నిర్మించిన సీసీరోడ్డుకు అడ్డంగా, మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకన్న గేటు నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటే అధికారులకు చెమటలు పట్టి ఉద్యోగం నుండి తీసేస్తారో ఏమో అన్నంతగా భయపడి వదిలేశారు.. అదేచోట 100 ఫీట్ల రహదారి రోడ్డు విస్తరణ పనులను ఆ మాజీ కౌన్సిలర్ అడ్డుకున్నట్టు అధికారులు చెప్పిందే.. దౌర్భాగ్యం ఏమిటంటే, 100 ఫీట్ల రోడ్డు ఆక్రమణలను, అక్రమ కట్టడాలను అడ్డుకోకుండా, సెటిల్మెంట్‌లకే ప్రాధాన్యత ఇచ్చిన దుండిగల్‌ సర్కిల్ మున్సిపల్ అధికారులు.. చివరికి చేసేదేమిలేక “100 ఫీట్ల రోడ్డును- 40 ఫీట్ల రోడ్డుకే పరిమితం చేశారు.. అప్పుడు రోడ్డు ఆక్రమణలకు.. ఆతర్వాత రోడ్డు కుదింపుకు దుండిగల్‌ మున్సిపల్ అధికారులే కీలక పాత్ర..

దుండిగల్‌, పెన్ పవర్, మార్చి‌ 9:

దుండిగల్‌ మండలం మల్లంపేట్‌‌లో ట్రాఫిక్ సమస్యకు హైడ్రా చెక్ పెట్టింది.. ఓల్డ్ హైదరాబాద్ రోడ్డుకు ప్రణీత్ ఆంటీలియాలో అడ్డుగా ఉన్న ప్రహరీగోడను తొల‌గిస్తే 3 కిలోమీట‌ర్లు.. లేదంటే 8 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సిన అవ‌స్థ‌ల‌కు హైడ్రా చెక్ పెట్టింది.. తమది గేటెడ్ క‌మ్యూనిటీ అంటూ 40 ఫీట్ల ర‌హ‌దారిని మూసేసి నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా సోమ‌వారం తొల‌గించింది. దీంతో 5 కిలోమీట‌ర్లు అద‌నంగా ప్ర‌యాణించాల్సిన భారం తగ్గించింది.. మ‌ల్లంపేట‌ ప్రాంత నివాసితుల‌కు ఊరట కలిగించింది.. ఔట‌ర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 4 నుంచి మ‌ల్లంపేట‌, బాచుప‌ల్లి క్రాస్‌రోడ్స్ మీదుగా ప్ర‌గ‌తిన‌గ‌ర్‌కు సుల‌భంగా చేరుకునే మార్గం సుగమం చేసింది..

హైకోర్టు మార్గదర్శకాల ప్రకారమే.. : మల్లంపేటలో రహదారికి అడ్డంగా ప్రణీత్ ఆంటీలియా నిర్మించిన ప్రహరీపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. రహదారికి ఆటంకాలు సృష్టించడంపై ప్రణీత్ ఆంటీలియా నిర్వాహకులకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. హైడ్రా నోటీసుపై ప్రణీత్ అంటీలియా హైకోర్టును ఆశ్రయించారు.. “డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని హైకోర్టు హైడ్రాకు సూచించింది.. ఈ మేరకు ఇరుపక్షాలు పిలిచి చర్చించింది.. హెచ్ఎండిఏ అనుమతిచ్చిన లేఅవుట్‌‌ గేటెడ్ కమ్యూనిటీ కాదని హైడ్రా నిర్ధారించుకుని.. గేటెడ్ కమ్యూనిటీ నిబంధనల మేరకు రోడ్లుకూడా కేటాయింపులు జరగ లేదని హైడ్రా గ్రహించింది.. హైకోర్టు సూచనల మేరకు నోటీసులు యిచ్చి రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ప్రహరీనీ సోమవారం హైడ్రా తొలగించింది.. వెంటనే హెచ్ఎండిఏ బిటి రోడ్డును కూడా వెంటనే చేపట్టి సోమవారం సాయంత్రానికి పూర్తి చేసిందని హైడ్రా అధికారులు తెలిపారు.. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా దుండిగ‌ల్ మండ‌లంలోని మ‌ల్లంపేట – బాచుప‌ల్లి గ్రామాల మ‌ధ్య నెల‌కొన్న ఈ వివాదానికి తెరపడింది..

5 కిలో మీట‌ర్లు త‌గ్గిన దారి..:  మ‌ల్లంపేట ఔట‌ర్ రింగురోడ్డు ఎగ్జిట్ నుంచి బాచుప‌ల్లి క్రాస్ రోడ్స్ మీదుగా ప్ర‌గ‌తిన‌గ‌ర్ కు కేవ‌లం 3 కిలోమీట‌ర్లు మాత్ర‌మే ప్ర‌యాణిస్తే స‌రిపోతోంది. కాని దారి మ‌ధ్య‌లో ప్ర‌ణీత్ ఆంటీలియాలో నిర్మించిన అడ్డుగోడతో 8 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించాల్సి వ‌చ్చేది. సోమ‌వారం ప్ర‌హ‌రీ తొల‌గ‌డంతో ఆ దూరం 3 కిలోమీట‌ర్ల‌కు త‌గ్గింది. మ‌ల్లంపేట ఎగ్జిట్ నుంచి మ‌ల్లంపేట విలేజ్‌, ప్ర‌ణీత్ లీఫ్‌కాల‌నీ, ఆకాష్ వెంచ‌ర్‌, డ్రీం వ్యాలీ కాల‌నీ, గ్రీన్‌పార్కు కాల‌నీ, సాయిన‌గ‌ర్ కాల‌నీ, బృందావ‌న్ కాల‌నీ, ఏపీఆర్ కాల‌నీ, ఇందిర‌మ్మ‌కాల‌నీ, ల‌క్ష్మి శ్రీ‌నివాస్ కాల‌నీ, హెచ్ ఎండీఏ, ప్ర‌ణీత్ ఆంటీలియా, బాచుప‌ల్లి చౌర‌స్తా మీదుగా ప్ర‌గ‌తిన‌గ‌ర్‌కు కేవ‌లం 3 కిలోమీట‌ర్ల రాజ‌మార్గంలో రాడానికి అవ‌కాశం ల‌భించింది..

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా తోపాటు, మాస్టర్ ప్లాన్ రోడ్లు ఆక్రమణలు ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి.. ఒకప్పుడు మల్లంపేట్‌ విలేజ్ అయినప్పటికీ, కాలక్రమేణా తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లకు కేంద్రంగా మారింది.. దీనికి తోడు మల్లంపేట్‌ ఎగ్జిట్-4 నిర్మించిన తరువాత ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైంది.. ప్రణీత్ అంటీలియా ప్రహరీగోడ తొలగింపుతో ఈ సమస్యకు కొంతవరకే పరిష్కారం చూపుతుంది.. రాబోయే కాలంలో ట్రాఫిక్ సమస్య కథ‌ మొదటికే వచ్చే అవకాశం లేకపోలేదు.. ఇప్పటికైన మల్లంపేట్‌‌లో ఉన్న మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ల రోడ్లు కాపాడితేనే భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టడానికి సులభంగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు..