PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 5:59 pm Posted By : SRIKANTH NARASIMHALA

ఉద్యాన పంటలతోనే అధిక ఆదాయం : ప్రత్తిపాటి

  •  ఏడాదికి రూ. 2 నుంచి రూ.3లక్షల ఆదాయం వచ్చే డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి.
  • ఉద్యాన పంటలకు అధిక రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి.
  • నాయకుల కష్టాన్ని గుర్తించకపోతే, ప్రజలకు మరోసారి కష్టానష్టాలు, రాష్ట్రానికి దుర్దినాలు.
  • వేలూరు, సందెపూడిలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి.
  • స్థానిక నాయకులతో కలిసి ఆయా గ్రామాల్లో రూ. 60 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీహాళ్లకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి.

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24 :

చిలకలూరిపేట : ప్రతి ఎకరాకు అధిక దిగుబడి. ప్రతి రైతుకు మంచి లాభం రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయానికి, పాడిపోషణకు ప్రభుత్వాలు అందించే రాయితీలను రైతాంగం సద్వినియోగం చేసుకొని, తమ జీవనప్రమాణాలు మెరుగు పరుచుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.

రైతన్నా మీకోసం – అన్నదాతా సుఖీభవ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట మండలం వేలూరు, యడ్లపాడు మండలం సందెపూడి గ్రామాల్లో వ్యవసాయవిభాగం నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రత్తిపాటి పాల్గొన్నారు. వేలూరులో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి, సందెపూడిలో రూ30 లక్షలతో నిర్మించ తలపెట్టిన సామాజిక భవనం (కమ్యూనిటీ హాల్), రూ.10లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు, డ్రైన్లకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రెండు గ్రామాల్లోనూ పలువురు రైతుల ఇళ్లకు వెళ్లి, ప్రభుత్వవిధివిధానాలు, నూతనసాగు పద్ధతులను ప్రత్తిపాటి అన్నదాతలకు అర్థమయ్యేలా వివరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన గ్రామసభల్లో మాట్లాడారు.

ఎకరాకు రూ. 2 నుంచి రూ.3 లక్షల ఆదాయమొచ్చేపంటలే సాగు చేయండి.

ఎకరాకు రూ. 4 నుంచి రూ.5 లక్షల ఆదాయం వచ్చే ఉద్యాన పంటల సాగుకు రైతులు ఈ ఏడాదే సిద్ధం కావాలన్నారు. ఏడాదికి రూ. 4, లేదా రూ.5 లక్షల ఆదాయం వస్తే.. దానిలో ఖర్చులు రూ.2లక్షలు పోయినా, రైతుకు రూ. 2 లేదా 3 లక్షలు తప్పకుండా మిగులుతాయన్నారు. 90శాతం సబ్సిడీపై ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వాలు అందించే అన్నిరకాల రాయితీలను రైతులు వినియోగించుకొని, తమ జీవితాలు మార్చుకోవాలన్నారు. పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. డిమాండ్ అధికంగా ఉండి, ఎక్కువ దిగుబడినిచ్చే పంటలసాగువైపు రైతులు మళ్లడానికి ఇదే సరైన సమయమని ప్రత్తిపాటి సూచించారు. సేంద్రీయ పద్ధతిలో పండించే కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. కాలానుగుణంగా రైతులు పంటలు మార్చాలని, అలానే తమ ఆలోచనలు, సాగు విధానాలు కూడా మార్చుకోవాలని ప్రత్తిపాటి రైతులకు సూచించారు.

అర్హులైన వారు ఉచిత ఇళ్లస్థలాలకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి…

టీడీపీ మేనిఫెస్టో హామీ ప్రకారం త్వరలోనే ఇళ్లస్థలాలు లేని పేద, మధ్యతరగతి వర్గాలకు పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఉచిత స్థలాలు అందచేయనున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. ఇంటిపట్టాలు పొందాలంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. ప్రతి ఒక్కరూ సచివాలయాన్ని సంప్రదించి, నిర్దేశించిన అర్హతల ప్రకారం ఉచిత ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

నాయకుల కష్టాన్ని గుర్తించకపోతే, ప్రజలకు మరోసారి కష్టనష్టాలే

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు, ప్రజలు వాటిపై విస్తృతమైన చర్చ చేపట్టాలని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేవారి ఆలోచనావిధానం మార్చాలని ప్రత్తిపాటి సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ల కష్టాన్ని గుర్తించకపోతే, మరోసారి ప్రజలు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రాష్ట్రానికి దుర్దినాలు దాపురిస్తాయని ప్రత్తిపాటి పేర్కొన్నారు. స్థానిక నాయకులపై అసూయ, ద్వేషంతో గ్రామాల్ని అభివృద్ధికి దూరం చేయవద్దని ప్రత్తిపాటి ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. మూడుపార్టీల నాయకులు కూడా తమచర్యలతో ప్రజలకు, పార్టీలకు మంచి జరిగేలా వ్యవహరించాలన్నారు. వేలూరు-గణపవరం బ్రిడ్టి నిర్మాణ పనుల్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

కార్యక్రమంలో గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, రైతు అధ్యక్షులు అంబటి సోంబాబు, మద్దినేని సుబ్బారావు, టీడీపీ నాయకులు కందిమల్ల రఘురామారావు, ముద్దన నాగేశ్వరరావు, మద్దినేనీ శివరామ కృష్ణ, కట్టా వేణు, కొండ్రగుంట శ్రీను, దాసు, ప్రభుదాసు, అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు, ఎమ్మార్వో, ఎంపీడీవోలు అధికారులు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.