భోగాపురంలో పర్యటించి పంటల పరిశీలన
స్టాఫ్ రిపోర్టర్ పెన్ పవర్, విజయనగరం. మార్చి 06 : అత్యధిక లాభాలను ఇచ్చే ఉద్యాన పంటలను సాగు చేయాలని జిల్లా రైతాంగానికి కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. భోగాపురం మండలంలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. కొయ్యపేటలో రైతులు సాగుచేస్తున్న ఉద్యాన పంటలను పరిశీలించారు. పొలాల్లో దిగి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సాగు చేస్తున్న పద్దతులు, మార్కెట్ సదుపాయం తదితర అంశాలను ఆరా తీశారు. వరి స్థానంలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలవైపు రైతులు దృష్టి సారించాలని కోరారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, పూల సాగు ద్వారా నిరంతరం ఆదాయాన్ని పొందవచ్చునని సూచించారు. ఉద్యాన సాగు వైపు మళ్లే రైతులకు జిల్లా యంత్రాంగం అన్నివిధాలా సహకారాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుందని హామీ ఇచ్చారు. అలాగే వారు పండించే పంటలకు మార్కెట్ సదుపాయాన్న, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తామని అన్నారు. అత్యధిక దిగుబడి కోసం సంప్రదాయ సాగు పద్దతులు బదులు ఆధునిక విధానాలను అవలంభించాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో ఉద్యానశాఖ డిడి చిట్టిబాబు, వ్యవసాయశాఖ ఎడి నాగభూషణరావు, మండల వ్యవసాయాధికారి హైమావతి, ఉద్యాన అధికారి ఉమాభారతి తదితరులు పాల్గొన్నారు.