PEN POWER
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 9:21 pm Posted By : MADHAV PATHI

ఏసీబీ వలలో.. జూనియర్ అసిస్టెంట్ గణేష్..

కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో ఏసిబి దాడులు..

లంచం తీసుకుంటుండగా ఉన్నపళంగా పట్టుకున్న “అనిశా” అధికారులు..

గణేష్‌కు ఇన్‌చార్జ్ “విఆర్వో” బాధ్యతలు కూడా అప్పగించినట్లు సమాచారం..

ఫ్యామిలి‌ మెంబర్ సర్టిఫికేట్ జారీకి లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్..

నిందితుడి నుండి రూ.15 వేలు స్వాధీన పరచుకున్న ఏసిబి అధికారులు..

కుత్బుల్లాపూర్, పెన్ పవర్, మార్చి 2:

ఏసిబి అధికారులకు చిక్కిన కుత్బుల్లాపూర్ రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్..

మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి అధికారి ఏసిబికి ఉన్నపళంగా దొరికి పోయాడు.. కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్న గణేష్‌కు “ఇన్‌చార్జ్ గ్రామపాలన అధికారి”గా కూడా బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.. రెండు విధులు నిర్వర్తిస్తున్న జి.గణేష్‌ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సిటీ రేంజ్–1 యూనిట్ అధికారులు పాల్గొన్నారు.. ఫిర్యాదుదారు కుటుంబ సభ్యులకు సంబంధించిన, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌ను జారీ చేయడానికి సంబంధిత జూనియర్ అసిస్టెంట్- (వీఆర్వో) రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.. ఇందులో భాగంగా డీల్ కుదుర్చుకున్న నేపధ్యంలో ముందుగా రూ. 5,000 ముట్టినవి, మిగతా చెల్లింపులు సోమవారం జరగాల్సి ఉంది. మిగిలిన మొత్తం 15000 రూపాయలు సోమవారం చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు..

నగదు స్వాధీన పరచుకున్న ఏసిబి..

లంచం తీసుకున్న అధికారుల నుంచి సంబంధిత నగదును స్వాధీనం చేసుకుని పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేశారు. చర్యలు చేపట్టిన ఏసీబీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో దాడి చేయగా పట్టుబడ్డ విఆర్వోను అరెస్టు చేసి, నాంపల్లిలోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు జ్యుడీషియల్ రిమాండ్‌కు హాజరు పరుస్తున్నారు.. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కేసు ముందుకు సాగే క్రమంలో మరిన్ని వివరాలు సేకరించేందుకు భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలు రహస్యంగా ఉంచినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తిఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసిన సందర్భంలో చట్టపరమైన చర్యల కోసం ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 ను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ (9440446106), ఫేస్‌బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్ (పూర్వం ట్విట్టర్) @Telangana ACB ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చని తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేసింది..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మూడు మండల రెవెన్యూ పరిధిలో, ప్రభుత్వ భూములు కబ్జాదారులకి ధారాదత్తం చేయడం, అక్రమంగా నాలా (వ్యవసాయేతర భూములుగా) కన్వర్శన్‌ల వ్యవహారాలు, కబ్జాదారులతో అంతర్గత ఒప్పందాల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.. “అవినీతి నిరోధక శాఖ” అధికారులు ఆ దిశగా కూడా దృష్టి సారిస్తే బాగుంటుందని నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు.. నియోజకవర్గంలో గాజులరామారం సర్కిల్- దుండిగల్‌ సర్కిల్ అధికారులపై దాడులు‌ నిర్వహించి కేసులు చేసిన వ్యవహారంలో ప్రజలు ఏసిబి అధికారులను అభినందించారు.. మూడు మండలా ల్లోనూ ఏసిబి దృష్టి సారించాలని విజ్ఞప్తి వేస్తున్నారు..