PEN POWER
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 2:42 pm Posted By : PEN POWER MEDIA

కోర్ అర్బన్ యాక్ట్‌తో నగర పాలనలో మార్పులు

  • పాత చట్టాలకు గుడ్‌బై చెప్పిన ప్రభుత్వం

  • అక్రమ కట్టడాలపై కఠిన చర్యలకు సిద్ధం

  • హైడ్రాకు విస్తృత అధికారాలు

  • నేరుగా నోటీసులు జారీ చేసే అవకాశం

  • చెరువుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం

  • ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ఆక్రమణలపై దృష్టి

  • డిజిటల్ నోటీసులతో పారదర్శకత పెంపు

  • అవినీతిపై క్రిమినల్ కేసులకు అవకాశం

  • ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ లక్ష్యం

హైదరాబాద్ నగర రూపురేఖలు మార్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత GHMC చట్టానికి బదులుగా “కోర్ అర్బన్ రీఫార్మ్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ యాక్ట్” తీసుకువచ్చి, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది.

హైదరాబాద్, పెన్ పవర్ మార్చి20 :

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహా నగరాభివృద్ధి కోసం దశాబ్దాల కాలం నాటి పాత చట్టాలను పక్కన పెట్టి, అత్యంత శక్తివంతమైన కోర్ అర్బన్ రీఫార్మ్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ చట్టాన్ని తీసుకువస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో రాబోయే ఈ కొత్త చట్టం, నగర పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రధానంగా అక్రమ కట్టడాల నియంత్రణ, చెరువుల సంరక్షణ , విపత్తు నిర్వహణను ఒకే గొడుగు కిందికి తీసుకురావడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం.ఈ కొత్త చట్టం ద్వారా హైడ్రా కు తిరుగులేని చట్టబద్ధమైన అధికారాలు లభించనున్నాయి. ఇప్పటివరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా అధికారులు ఇతర మునిసిపల్ విభాగాలపై లేదా రెవెన్యూ అధికారుల నోటీసులపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ కోర్ చట్టం అమలులోకి వస్తే, హైడ్రా నేరుగా అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసే అధికారంతో పాటు, తక్షణమే కూల్చివేతలు చేపట్టే విచక్షణాధికారాలను కూడా పొందుతుంది.

దీనివల్ల కాలయాపన తగ్గి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుంది.నగర పరిధిలోని ప్రభుత్వ భూములు, ఎఫ్‌టీఎల్ పరిధులు , బఫర్ జోన్ల ఆక్రమణలను అడ్డుకోవడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుంది. నోటీసులు ఇచ్చే ప్రక్రియను డిజిటలైజ్ చేయడం ద్వారా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా, నిబంధనలు ఉల్లంఘించే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కఠిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు. ఇది క్షేత్రస్థాయిలో అవినీతిని అరికట్టడానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.కోర్ చట్టం కేవలం అక్రమ కట్టడాల కూల్చివేతకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో హైదరాబాద్‌ను ఒక ప్రణాళికాబద్ధమైన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు పునాదిగా నిలవనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి పాత చట్టాల వల్ల ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తూ, నూతన తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు. అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి, అధికారికంగా అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.