PEN POWER
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 8:57 am Posted By : YEDUKONDALU DADALA

క్రికెట్ బెట్టింగ్‌తో జీవితాలు చిద్రమవుతాయి: ఎస్సై హెచ్చరిక

  1. కాజులూరు, పెన్ పవర్,మార్చి 31:
    ఐపీఎల్ (ఐపిఎల్) క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో మండలంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గొల్లపాలెం ఎస్సై ఎం. మోహన్ కుమార్ హెచ్చరించారు.ఈ సందర్భంగా యువత, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన పలు కీలక సూచనలు చేశారు.ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో బెట్టింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశముండటంతో మండల వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహించినా లేదా పాల్గొన్నా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం (ఏపీ గేమింగ్ యాక్ట్ ) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో యువత బెట్టింగ్ యాప్‌లకుఆకర్షితులవుతున్నారని, శ్రమించకుండా వచ్చే డబ్బు శాశ్వతం కాదని, అది భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం,వారు ఉపయోగిస్తున్న యాప్‌లు,వారి పరిచయాలు వంటి అంశాలను గమనించాలని సూచించారు.క్రికెట్ ఒక వినోదం మాత్రమేనని, దాన్ని జూదంగా మార్చి కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టవద్దని అన్నారు. ఒక తప్పుడు నిర్ణయం యువత భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆశలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు.మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్సై ఎం మోహన్ కుమార్ పేర్కొన్నారు.