PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 10:11 pm Posted By : A YESOBU

గంగవర గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా…

టిడిపి ఇంచార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు
పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 27

గంగవరం గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రకటించారు.సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.పుల్లల చెరువు మండలం గంగవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రభుత్వ పనితీరు, భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం క్రమంగా నెరవేర్చుతోందని ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు. ప్రారంభంలో రూ.3000గా ఉన్న సామాజిక పెన్షన్లను రూ.4000కు పెంచినట్లు, వికలాంగులకు రూ.6000గా ఉన్న పింఛన్లను రూ.10,000కు పెంచినట్లు తెలిపారు. అలాగే ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు.విద్యా రంగానికి ప్రాధాన్యం ఇస్తూ ‘తల్లికి వందనం’ పథకం ద్వారా కుటుంబంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.మహిళల సంక్షేమం కోసం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి కీలక నిర్ణయాలు అమల్లో ఉన్నాయని చెప్పారు.రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆయన వెల్లడించారు.వ్యవసాయం లాభదాయకంగా మారేందుకు పలు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.యువత ఉపాధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగ అవకాశాలను కల్పించిందని తెలిపారు.గతంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొన్న యువతకు ఇది ఊరటనిచ్చిందన్నారు.మార్కాపురం జిల్లా అభివృద్ధికి కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎరిక్షన్ బాబు స్పష్టం చేశారు. గతంలో నిర్మాణ లోపాల వల్ల కాలువలు దెబ్బతిన్నాయని, వాటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి, రూ.500 కోట్లతో కాంక్రీట్ పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.త్వరలోనే సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారం కానున్నాయని చెప్పారు.గంగవరం గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని ఆయన తెలిపారు. గ్రామంలో సిమెంట్ రోడ్లు, తాగునీటి సౌకర్యం, దళితవాడల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గ్రామ ప్రజల దీర్ఘకాల డిమాండ్ అయిన ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.మొదటి దశలో రూ.50 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించి, అనంతరం తారు రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు.గతంలో ఆగిపోయిన రోడ్డు పనులను పునఃప్రారంభించి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గంగవరం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ప్రజల సహకారంతో అన్ని హామీలను నెరవేర్చుతామని గూడూరి ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ పోట్ల గోవిందు మాజీ కన్వీనర్ పల్లపాటి బాదరయ్య, కాకర్ల కోటయ్య శనగ నారాయణరెడ్డి ఉప్పల హనుమంత్,గజ్వేల్ భాస్కర్, ఆర్మీ బుజ్జి, టిడిపి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.