- పీఏసీలో నాగిరెడ్డికి కీలక బాధ్యత
- 2019 విజయాన్ని గుర్తుచేసుకున్న పార్టీ
- పవన్ కళ్యాణ్‌పై నాగిరెడ్డి సంచలన విజయం
- 2024లో వ్యూహాలు విఫలం
- క్యాస్ట్ ఈక్వేషన్స్ గందరగోళం
- లాస్ట్ మినిట్ అభ్యర్థి మార్పుల ప్రభావం
- నాయకత్వ లోపంతో ఇబ్బందులు
- స్థానిక ఎన్నికల ముందు వ్యూహ మార్పు
- పాత క్యాడర్‌ను మళ్లీ చైతన్యపరిచే ప్రయత్నం
- డ్యామేజ్ కంట్రోల్‌కు వైసీపీ కొత్త వ్యూహం
- ఓటమి పాఠాలతో రూట్ మార్చిన జగన్ టీమ్
- స్థానిక ఎన్నికల ముందు వైసీపీ కీలక నిర్ణయం
గాజువాకలో ఘోర పరాజయం తర్వాత వైసీపీ డ్యామేజ్ కంట్రోల్‌కు దిగినట్లు సంకేతాలు స్పష్టమవుతున్నాయి. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ పట్టు బలోపేతం చేయాలనే లక్ష్యంతో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని మళ్లీ కీలక పాత్రలోకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్టణం, మార్చి 24 :
ఏపీ రాజకీయాల్లో గాజువాక నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సామాజిక సమీకరణాలు కంటే స్థానిక నాయకత్వం, వ్యూహాలు కీలకంగా మారే ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన పరాజయం పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫలితాలే గాజువాకలోనూ ప్రతిబింబించడంతో వైసీపీ పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ వ్యూహాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకువస్తూ స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటు కల్పించడం విశేషంగా మారింది. పీఏసీ అనేది వైసీపీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కమిటీ. సాధారణంగా సీనియర్ నేతలు, మాజీ మంత్రులకు మాత్రమే అవకాశం లభించే ఈ కమిటీలో నాగిరెడ్డికి చోటు ఇవ్వడం వెనుక పార్టీ పెద్దల వ్యూహం ఏంటన్నది చర్చనీయాంశమైంది.
డి
2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసిన నాగిరెడ్డి, తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. తన కుమారులకు అవకాశం ఇవ్వాలని కోరినా పార్టీ హైకమాండ్ స్పందించకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు.
అయితే 2024 ఎన్నికల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు గాజువాకలో పూర్తిగా విఫలమయ్యాయి. చివరి నిమిషంలో అభ్యర్థి మార్పులు, వ్యూహాల లోపం కారణంగా వైసీపీ భారీ పరాజయాన్ని చవిచూసింది. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్‌కు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ రావడం పరిస్థితిని స్పష్టం చేసింది.
ప్రస్తుతం గాజువాకలో వైసీపీకి బలమైన నాయకత్వం లేకపోవడం పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో నాగిరెడ్డిని మళ్లీ రంగంలోకి దింపి పార్టీని పునర్నిర్మించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయాన్ని పక్కన పెట్టి ముందుగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని నాగిరెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆయన తన కుటుంబాన్ని, కేడర్‌ను మళ్లీ ఏకం చేసి వైసీపీకి పాత ఊపును తీసుకురావాలనే లక్ష్యంతో పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రాజకీయంగా వెనుకబడిన గాజువాకలో నాగిరెడ్డి ఎంట్రీతో పరిస్థితులు మారుతాయా? వైసీపీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.