PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 1:03 pm Posted By : SIVA KUMAR LANKA

గుమ్మడిగొండలో ఉచిత మెగా పశువైద్యశిబిరం ప్రారంబించిన స్పీకర్

ఉచిత మెగా పశు వైద్య శిబిరం ప్రారంభించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

నాతవరం, పెన్ పవర్ :

​నాతవరం మండలం గుమ్మిడిగొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోనే పాడి పశువులు అత్యధికంగా ఉన్నందున ఈ గ్రామంలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాడి ఉత్పత్తిని మరింతగా పెంచడమే ఈ మెగా శిబిరం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ శిబిరానికి రైతులు తీసుకొచ్చిన పశువులకు ఉచితంగా రక్త, మూత్ర, పేడ, గర్భ, పాల పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తామని ఆయన వెల్లడించారు. త్వరలోనే మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామంలో కూడా ఇటువంటి ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నామని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్వం ఇళ్లలో పాడి పశువులు ఉంటే దానిని పెద్ద ఆస్తిగా భావించేవారని, అటువంటి వారికే తమ పిల్లలను ఇచ్చి వివాహం చేసేవారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
​నియోజకవర్గంలో పశుసంపద మరియు వాటి సంరక్షణపై తీసుకుంటున్న చర్యలను స్పీకర్ సభకు వివరించారు. నియోజకవర్గంలో మొత్తం 25,194 ఆవులు, 38,134 గేదెలతో కలిపి 63,328 పశువులు ఉండగా, ఒక్క నాతవరం మండలంలోనే 14,965 ఆవులు, 8,455 గేదెలతో కలిపి మొత్తం 23,420 పశువులు ఉన్నాయని గణాంకాలను వెల్లడించారు. ఈ పశువులకు సరైన వసతి, రక్షణ కల్పించేందుకు నియోజకవర్గంలో 148 గోకులం షెడ్లు నిర్మించామన్నారు. వేసవి కాలంలో పశువులకు నీటి కొరత లేకుండా ఉండేందుకు 122 తాగునీటి తొట్టెలను సైతం నిర్మించామని తెలిపారు. గత 2014-2019 మధ్యకాలంలో కూడా నియోజకవర్గంలో 284 పశువుల షెడ్లను (గోకులం షెడ్లు) నిర్మించినట్లు ఆయన గుర్తు చేశారు. అనంతరం గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కేటాయింపుల గురించి ఆయన మాట్లాడారు. గుమ్మిడిగొండ గ్రామానికి ప్రత్యేకంగా 38 లక్షల రూపాయలు కేటాయించామని, ఇందులో 28 లక్షలతో నాలుగు సీసీ రోడ్ల నిర్మాణం 10 లక్షలతో శ్మశాన వాటిక పనులు జరుగుతున్నాయన్నారు. దీనికి అదనంగా రోడ్ల అభివృద్ధి కోసం భారీగా నిధులు వెచ్చించామన్నారు. నాతవరం నుండి గుమ్మిడిగొండకు తారు రోడ్డు కోసం 75 లక్షలు, గుమ్మిడిగొండ నుండి నల్లగొండమ్మ గుడి వరకు సీసీ రోడ్డు మరియు కల్వర్టుల కోసం 89 లక్షలు, కోడవడపూడి జంక్షన్ నుండి వెదురుపల్లి జంక్షన్ వరకు కోటీ 5 లక్షలు.. ఇలా రహదారుల కోసమే మొత్తం 3 కోట్ల 7 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అలాగే నాతవరం మండలానికి ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) ద్వారా 261 పనులకు గాను 20 కోట్ల 52 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. మొత్తంగా నియోజకవర్గంలో అన్ని డిపార్ట్‌మెంట్లు కలిపి ఇప్పటివరకు 425 కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి పనుల కోసం తీసుకువచ్చామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్ర, టిడిపి మండల ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ, ఎడి టి సతీష్ కుమార్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి ఎల్ అశోక్ కుమార్, డి ఎ హెచ్ ఓ రామ్మోహన్ రావు, డాక్టర్ల బృందం, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, ఎంపీడీవో సత్య శ్రీనివాస్, ఎంఆర్ఓ చందనలేఖ, గుమ్మడి కొండ మాజీ సర్పంచ్ సుర్ల వెంకటరమణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు చింతకాయల ప్రశాంత్ టిడిపి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు