చింతపల్లి నియోజకవర్గ పునరుద్ధరణపై ఆశల
- (స్టాప్ రిపోర్టర్ మాదిరి చంటిబాబు)గూడెం కొత్త వీధి, పెన్ పవర్, మార్చి 25:గతంలో ఉమ్మడి విశాఖ పట్నం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందిన చింతపల్లి శాసనసభ నియోజకవర్గం మళ్లీ పునరుద్ధరించాలన్న ఆశలు స్థానిక ప్రజల్లో మళ్లీ చిగురిస్తున్నాయి. అప్పట్లో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలతో పాటు నాతవరం, గొలుగొండలలోని గిరిజన గ్రామాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉండేవి.కాలక్రమేణా జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చింతపల్లి నియోజకవర్గం రద్దై, ప్రస్తుతం పాడేరు నియోజకవర్గంలో విలీనమైంది. దీంతో గిరిజన ప్రాంతాల ప్రత్యేక అవసరాలు, సమస్యలు తగిన స్థాయిలో వినిపించడం లేదన్న అభిప్రాయం స్థానికుల్లో ఉంది.చింతపల్లి శాసనసభ నియోజకవర్గం 1978లో ఏర్పడి, 2008లో రద్దయింది. ఇది విశాఖపట్నం జిల్లాలో గిరిజన ప్రాంతాలను కవర్ చేసేది.ఇప్పుడు మళ్లీ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, చింతపల్లి నియోజకవర్గం తిరిగి ఏర్పాటు కావాలన్న డిమాండ్ బలపడుతోంది. గిరిజన గ్రామాల అభివృద్ధికి, ప్రజల సమస్యలకు ప్రత్యేక ప్రాతినిధ్యం అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చింతపల్లి నియోజకవర్గం పునరుద్ధరణ జరిగితే, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.