గూడెం కొత్త వీధి,పెన్ పవర్,మార్చి 28:మండలంలోని అనేక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ, ఎంపీపీ బోయిన కుమారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు డిమాండ్లు చేశారు.గూడెం కొత్త వీధి మండలంలోని చాలా గ్రామాల్లో పాడైన ఇనుప విద్యుత్ స్తంభాలు జనవాసాల మధ్య ఉండటంతో ప్రజలు భయంతో బాధపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. అందువలన, పాత స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని ఎంపీపీ కోరారు.అలాగే, సఫర్ల పిహెచ్సిలో రెగ్యులర్ వైద్యులను నియమించి, వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించాలని సూచించారు. మరమ్మత్తులు చేయాల్సిన అంబులెన్స్‌ల కారణంగా రోగులను తరలించేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, పాతవాటిని మార్చి వాటి స్థానంలో కొత్త వాహనాలను మంజూరు చేయాలని ఆమె అభ్యర్థించారు. అలాగే పెదవలస-లకవరపేట మధ్య ప్రభుత్వ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం చర్యలు చేపట్టాలని ఎంపీపీ బోయిన కుమారి ప్రతిపాదించారు. మండలంలోని అభివృద్ధి, ప్రజల సౌకర్యం, భద్రత మరియు వైద్య సేవల పరిరక్షణ కోసం ఈ సూచనలను జిల్లా అధికారులు పరిశీలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.