- పార్టీని, శ్రేణుల్ని కంటికి రెప్పలా కాపాడే చంద్రబాబు నాయకత్వమే మన రక్షణ కవచం.
- లోకేశ్ యువనాయకత్వంలో పార్టీ జాతీయస్థాయిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది.
- 44 వసంతాల వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, టీడీపీ శ్రేణుల ర్యాలీలో పాల్గొన్న ప్రత్తిపాటి.
- పార్టీ నిర్దేశించిన వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన 11 మందిని సన్మానించిన ప్రత్తిపాటి.
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29:
చిలకలూరిపేట: తెలుగుదేశం ఆవిర్భావమే రాజకీయాల్లో పెనుమార్పులు, విప్లవాత్మక సంస్కరణకు బీజం వేసిందని, తన మాటే శాసనంగా స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుప్రజల హృదయాల్లో పార్టీకి శాశ్వత స్థానం కల్పించారని, ప్రజాసంక్షేమం..అభివృద్ధే ప్రమాణాలుగా చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత స్థానిక ఎన్ఆర్ టీ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రత్తిపాటి, పార్టీశ్రేణులతో ర్యాలీగా బయలుదేరి పార్టీ కార్యాలయానికి వెళ్లి, టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన పలువురు నాయకులు, కార్యకర్తలను సన్మానించిన అనంతరం ప్రత్తిపాటి వారితో కలిసి భోజనం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం, ప్రత్తిపాటి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
పార్టీని, శ్రేణుల్ని కంటికి రెప్పలా కాపాడే నాయకుడు చంద్రబాబు..
మార్చి 29 1982న పురుడు పోసుకున్న తెలుగుదేశం.. నాటి నుంచి నేటి వరకు ఎన్నోఆటుపోట్లు, సంక్షోభాలు, గెలుపోటములను తట్టుకొని ప్రజాక్షేత్రంలో అజేయంగా నిలిచిందని ప్రత్తిపాటి చెప్పారు. అధికారంతో పనిలేకుండా ఎలాంటి అండదండలు లేకున్నా ఇది మా పార్టీ అనే నమ్మకం, విశ్వాసంతో పనిచేసే వారిని పార్టీ అధినాయకత్వం ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించి ప్రోత్సహిస్తోందన్నారు. పార్టీ శ్రేణులపై ఈగవాలకుండా, కంటికి రెప్పలా కాపాడుకునే చంద్రబాబు నాయకత్వమే మనందరికీ గొప్ప రక్షణ కవచమని, ఆ కవచాన్ని యువనాయకుడు, మంత్రి లోకేశ్ మరింత బలోపేతం చేస్తున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. లోకేశ్ సమర్థ నాయకత్వంలో పార్టీ భవిష్యత్ లో జాతీయస్థాయిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు.
పార్టీ అప్పగించిన బాధ్యతల నిర్వహణలో సమర్థత చాటుకున్నాను
చంద్రబాబు గతంలో తనపై నమ్మకంతో అప్పగించిన పార్టీ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించానని ఆయన చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో సమర్థతను చాటుకున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన యువగర్జన సభ నభూతో అన్నవిధంగా పార్టీ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ప్రధాని మోదీ సభను కూడా అదే స్థాయిలో విజయవంతం చేశామన్నారు. తర్వాత లోకేశ్ చేపట్టిన యువగళం యాత్ర సక్సెస్ లో ముఖ్యభూమిక పోషించామన్నారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు లోకేశ్ తో యాత్రలో పాల్గొనడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవమన్నారు. 2019లో అవినీతిపరుల్ని గెలిపిస్తే నియోజకవర్గం అన్నిరంగాలలో మళ్లీ వెనక్కు వెళ్లిందన్నారు.
టీడీపీ శ్రేణులు దురాలోచనలకు అతీతంగా పార్టీకోసం పనిచేయాలి.
తమతో ఉండే వారు ఎదుగుతున్నారని, తమకు గుర్తింపు రావడంలేదనే దురాలోచనలు మానేసి..మన పార్టీ ఎదుగుతోందనే సద్భావనతో పార్టీ శ్రేణులు ఓర్పు, సంయమనంతో వ్యవహరించాలని ప్రత్తిపాటి సూచించారు. రాత్రికి రాత్రే ఎవరికీ లబ్ధి చేకూరదని, పార్టీ సిద్ధాంతాలు, ఆలోచనలకు కట్టుబడి, నిజాయితీగా పనిచేసే వారికి తప్పకుండా మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ షేక్ రఫాని, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్, జిల్లా నాయకులు బత్తినేని శ్రీనివాసరావు, అమరా రమాదేవి, క్లస్టర్ ఇంచార్జీలు మద్దిబోయిన శివ, ముల్లా కరీముల్లా, కొత్త కోటేశ్వరరావు, షేక్ మస్తాన్ వలి, గంజి శ్రీనివాసరావు, వివిధ హోదాలలో ఉన్న టీడీపీ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.