PEN POWER
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 9:20 pm Posted By : SRIKANTH NARASIMHALA

టీడీపీ హాయాంలోనే గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి : ప్రత్తిపాటి

  • పారిశ్రామిక పెట్టుబడులు వస్తేనే ప్రజలకు సంక్షేమం.. రాష్ట్రానికి ఆదాయం, అభివృద్ధి
  • సాగునీటి కాలువలపై త్వరలోనే డ్రాపుల నిర్మాణం..షట్టర్ల ఏర్పాటు
  • రూ.32 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మాజీమంత్రి ప్రత్తిపాటి, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ 

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29:  

యడ్లపాడు: పౌర సేవలతో పాటు.. ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో కూటమిప్రభుత్వం చురుగ్గా స్పందిస్తోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి దశలవారీగా నిధులు మంజూరు అవుతాయని, వచ్చే రెండు, మూడేళ్లలో మొత్తం అభివృద్ధి పూర్తి చేస్తామని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.

యడ్లపాడు మండలం జగ్గాపురంలో రూ.32 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం సాయంత్రం ఆయన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ ఎం.వీ.ఆర్ కృష్ణతేజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చెప్పిన సమస్యలు విన్న ప్రత్తిపాటి.. కమిషనర్ కృష్ణతేజలు త్వరలోనే అన్నీ పరిష్కారమవుతాయని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం ప్రత్తిపాటి గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.

పెట్టుబడులు వస్తేనే ప్రజలకు సంక్షేమం.. రాష్ట్రాభివృద్ధి.

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ లు తీవ్రంగా కష్టపడి సాధిస్తున్న పెట్టుబడుల వల్ల అంతిమంగా లబ్ధి కలిగేది తమకేననే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. పెట్టుబడులు రాకుంటే రాష్ట్రానికి ఆదాయం, అభివృద్ధి రెండూ ఉండవని, ఒక లక్ష కోట్ల పెట్టుబడి వస్తే, దానిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వానికి రూ.25వేల కోట్ల ఆదాయం లభిస్తుందన్నారు. జగన్ ఐదేళ్లు చేసిన అప్పులు..వడ్డీలు తీరుస్తూనే, ప్రజలకు అవసరమైన అన్ని పథకాలను ప్రభుత్వం సకాలంలో అందిస్తోందన్నారు. ఉచిత బస్సు, తల్లికి వందనం, దీపం, అన్నదాత సుఖీభవ పథకాలతో పాటు, మహిళల్ని, రైతుల్ని ఆర్థికంగా స్థిరపరచాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనని ప్రత్తిపాటి చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో అన్నిరకాల అభివృద్ధి నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు.

సాగునీటి కాలువలపై 32 షట్టర్ల ఏర్పాటు..

నియోజకవర్గంలోని తాగు, సాగునీటి అవసరాలు తీర్చే ఎత్తిపోతల పథకాల నిర్వహణను రైతుల భాగస్వామ్యంతో ప్రభుత్వమే చేపట్టనుందన్నారు. కాలువ డ్రాపుల నిర్మాణంతో పాటు… వాటిపై ఏర్పాటు చేసే 32 షట్టర్లను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు.

కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, మద్దినేని శివరామకృష్ణ, మద్దినేని సుబ్బారావు, ముద్దన నాగేశ్వరరావు, ముద్దన తులసమ్మ, పోపురి వెంకటేశ్వర్లు, తులసి రత్తయ్య, పోపురి శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో జ్యోతి బాస్ , డ్వామా పీడీ చారి, డిపివో నాగేశ్వరరావు నాయక్, ఎంపీడీవో , అధికారులు, కూటమి నాయకులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.