PEN POWER
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 2:57 pm Posted By : PEN POWER MEDIA

టీ కాంగ్రెస్‍లో బీసీ వర్సెస్ రెడ్డి

  • కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలకలం

  • జగ్గారెడ్డిపై మాస్ ఎలివేషన్స్ హాట్ టాపిక్

  • పీసీసీ మార్పు చర్చతో పార్టీ లోపలి ఉద్రిక్తత

  • బీసీ నేతల ఆగ్రహం వ్యక్తం

  • మహేశ్ కుమార్ గౌడ్ స్థితిగతులపై సందేహాలు

  • రెడ్డి వర్సెస్ బీసీ వాదనకు తెర

  • సొంత పార్టీలోనే విమర్శల వెల్లువ

  • సీఎం రేవంత్ హెచ్చరికల మధ్య వివాదం

  • కోమటిరెడ్డి వివరణతో కొత్త మలుపు

  • కాంగ్రెస్‌లో వర్గ రాజకీయాల ప్రభావం

 

తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు మళ్లీ తలెత్తింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీసీ వర్సెస్ రెడ్డి వివాదానికి నాంది పలికాయి. పీసీసీ మార్పుపై వచ్చిన చర్చ పార్టీ అంతర్గత రాజకీయాలను వేడెక్కించింది.

హైదరాబాద్, పెన్ పవర్ మార్చి20 : 

 

తెలంగాణ కాంగ్రెస్‍లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి మాస్ లీడర్ అని ఆయనకు పీసీసీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామంటూ మాస్ ఎలివేషన్స్ ఇచ్చారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాల్సిన అధికార పార్టీలో, ఉన్నట్టుండి పీసీసీ మార్పు అంశం చర్చకు రావడం ఆసక్తిగా మారింది. దాంతో ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పరిస్థితి ఏంటి? అంటూ బీసీ నేతలు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీ అనే వివాదానికి తెరలేపినట్లైంది. ప్రస్తుతం బీసీ వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీగా కొనసాగుతున్న తరుణంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగ్గారెడ్డిని పీసీసీ చేయాలని అలా చేస్తే వంద సీట్లు సాధిస్తామని చిట్ చాట్ లో చెప్పడాన్ని బీసీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఖనిజావృద్ధి సంస్థ చైర్మన్, కాంగ్రెస్ నేత ఈరవత్రి అనిల్ స్పందిస్తూ సొంత పార్టీపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరం అన్నారు. మంత్రి వ్యాఖ్యలు బీసీ నాయకత్వాన్ని కించపర్చడమేనని బీసీల పట్ల ఎందుకంత వివక్ష అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిని చేస్తే కీలకమైన హోదాలో ఉండి ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్‍మెంట్లు ఇస్తూ పార్టీ పరువు తీస్తున్నారని సొంత పార్టీ మద్దతుదారులే సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డిపైనే తీవ్ర ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి ఇప్పుడు ఆయన కేబినెట్ లోనే ఉంటూ బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారుతాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే పార్టీ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. సీఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం చేస్తూ అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దని, పార్టీ, ప్రభుత్వ పరమైన లైన్‍లోనే అందరూ స్పందించాలని సూచించారు. అయినా మంత్రి కోమటిరెడ్డి మాత్రం జగ్గారెడ్డి విషయంలో చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చిచ్చురాజేసినట్లైంది.తన వ్యాఖ్యలు పార్టీలో వివాదానికి దారి తీస్తుండటంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మహేశ్ కుమార్ గౌడ్‍పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ సారథ్యంలోనే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామని చెప్పారు. రంజాన్ వేడుకలకు జగ్గారెడ్డి ఏర్పాట్లు బాగున్నాయి. అందుకే పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని మాత్రమే అన్నారు. ఇప్పుడున్న పీసీసీని తొలగించాలనేది ఉద్దేశం కాదు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు