- ఫ్లైఓవర్ కింద జీవితం
- దయ కోసం ఎదురు చూపులు
- రాత్రులు – భయంతో నిండిన క్షణాలు
- ఆ దుర్ఘటన రాత్రి
- కళ్లముందే పిల్లల మరణం
- ఆసుపత్రి ముందు నిశ్శబ్దం
- మద్యం మత్తులో ప్రమాదం?
- మానసిక వేదన
- ఇల్లు లేని జీవితం
- మానవత్వానికి ప్రశ్న
ఒక తల్లి… ముగ్గురు చిన్న పిల్లలు… ఆశ్రయం లేని జీవితం… ఢిల్లీలోని ఫ్లైఓవర్ కింద గడిచే రోజులు… కానీ ఒక రాత్రి జరిగిన భయానక ప్రమాదం ఆమె జీవితాన్ని శాశ్వతంగా చీల్చేసింది. పిల్లల ఊపిరిని లెక్కపెడుతూ కాపాడుకునే తల్లి కళ్ల ముందే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాద గాథ ఇది.
ఢిల్లీ నగరంలోని ఒక ఫ్లైఓవర్ కింద 40 ఏళ్ల అబీదా తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఒక పాత మత్తు, పక్కనే చిన్న సంచి, చుట్టూ పిల్లలు—అదే ఆమె ప్రపంచం. ప్రతి ఉదయం ఆమె హజ్రత్ నిజాముద్దీన్ దర్గా దగ్గరకు వెళ్లి భిక్ష అడిగి, రోజు గడిపే ఆహారం సంపాదిస్తుంది. “అక్కడి వాళ్లు కొంచెం దయగా ఉంటారు” అని ఆమె చెబుతుంది. పగలు ఎలా అయినా గడుస్తుంది. కానీ రాత్రులు మాత్రం భయంతో నిండిపోతాయి. చలిలో పిల్లలను గట్టిగా కౌగిలించుకుని అబీదా నిద్రపోతుంది. ఒక చేతిలో చిన్న కూతురు సోని, పక్కనే ఐదేళ్ల అమిర్, ఏడేళ్ల రోష్ని. “వాళ్ల ఊపిరిని లెక్కపెడుతుంటాను… ఎవరైనా తీసుకెళ్తారేమో అనిపిస్తుంది” అని ఆమె బాధతో చెబుతుంది. అయితే 2023 నవంబర్‌లో ఒక తెల్లవారుజామున ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఘటన జరిగింది. ఉదయం సుమారు 5 గంటల సమయంలో వేగంగా వచ్చిన ఒక కారు నిద్రలో ఉన్న వారిపై దూసుకువచ్చింది. ఒక్కసారిగా చుట్టూ దుమ్ము, రక్తం, కేకలు మాత్రమే కనిపించాయి. “కళ్లుతెరిచినప్పుడు నా పిల్లలు కారు కింద చిక్కుకుపోయారు,” అని ఆమె వేదనతో గుర్తుచేసుకుంది. ఐదేళ్ల సోనియా, ఏడేళ్ల అమిర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. “వాళ్ల ముక్కలను నా చేతులతోనే ఏరుకున్నాను… సహాయం కోసం ఎంత కేకలు వేసినా ఎవరూ వెంటనే రాలేదు” అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె అక్కడే నిలబడి, చేతులపై రక్తంతో పిల్లలను చూస్తూ… “బహుశా ఇంకా బ్రతికే ఉన్నారేమో… మెలకువ వస్తుందేమో…” అని ఆశపడింది. కానీ ఆ ఆశ కేవలం క్షణాల్లోనే చెదిరిపోయింది. ఆ తర్వాత అంబులెన్స్ వెనకాల ఆటోలో ఆసుపత్రికి వెళ్లింది. మోర్గ్ ముందు గంటల తరబడి కూర్చుని, చివరిసారి పిల్లలను చూడటానికి ఎదురు చూసింది. కానీ… వారికి సమాధి చేయడానికి కూడా స్థలం లేకపోయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ప్రకారం , ఆ కారులో ఉన్న వారు మద్యం సేవించి ఉన్నట్లు అనుమానం. అదే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత అబీదా మానసికంగా పూర్తిగా కుంగిపోయింది. “ఆ శబ్దం ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటుంది… వాళ్లు నా ఒడిలో నిద్రపోయేవారు,” అంటూ ఆమె తన చేతులను చూస్తూ బాధ వ్యక్తం చేసింది. “ఆ రోజు నుంచి నా శరీరం లో భాగమే పోయినట్టు అనిపిస్తుంది” అని ఆమె గుండెల్లో మంటతో చెబుతుంది. అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే… ఆ దారుణ ఘటన జరిగిన అదే పాదదారిపైనే ఇప్పటికీ అబీదా జీవిస్తోంది. “మాకు ఇల్లు లేదు… గ్రామంలో భూమి లేదు… ఇక్కడ పని లేదు… ఎక్కడికి వెళ్తాం?” అని ఆమె ప్రశ్నిస్తుంది. “ఈ రోడ్డు తప్ప మాకు ఇంకెక్కడా స్థలం లేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఢిల్లీలోని అబీదా ఒక్క జీవితమే కాదు…. దేశంలో అన్ని రాష్ట్రాలలో … అన్ని జిల్లాలలో ఎందరో అభిదా లు ఉన్నారు … ప్రభుత్వాలకు బాధ్యత లేదా..? ఎన్నికల సమయంలో ఓట్ల అడిగేందుకు పరిగెడుతున్న నాయకులు వీళ్లు మనుషులేనని భారత దేశంలోనే జీవిస్తున్నారని వారికి అర్థం అవుతుందా..? ఓ …. వీరికి ఓట్లు లేవు కదా, అందుకనే ఢిల్లీలో గాలికి భద్రత లేనట్లే… వీరి భద్రత కూడా రోడ్డుకు వదిలేశారా..! చూద్దాం ఏ నాయకుడు వచ్చి.. వీళ్ళ బ్రతుకులు మారుస్తాడో వేచి చూడాల్సిందే..!