PEN POWER
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 11:59 am Posted By : SIVA KUMAR LANKA

నర్సీపట్నంలో గ్యాస్ కోసం ఆందోళన చెందవద్దు

నర్సీపట్నంలో గ్యాస్ కోసం ఆందోళన చెందవద్దు

-తగినన్ని రప్పించాం

-ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం

-స్పీకర్ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, పెన్ పవర్ :

​నర్సీపట్నంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ సందర్భంగా ప్రజలకు గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, వంట గ్యాస్ కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. పండుగకు సుమారు లక్ష మంది వరకు వస్తారు కాబట్టి, ప్రతి ఇంటికి బంధువుల రాకతో గ్యాస్ అవసరం పెరుగుతుందని గుర్తించి అధికారులతో మాట్లాడి ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటివరకు సుమారు 4,500 గ్యాస్ సిలిండర్లను నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోకి తెప్పించామని, మరో 2,000 సిలిండర్లు కూడా అందుబాటులోకి వచ్చాయని ఆయన వివరించారు. ఇంకా అవసరమైన మరో 2,000 సిలిండర్ల లోడ్ కూడా రాత్రికి చేరుకుంటుందని భరోసా ఇచ్చారు. నర్సీపట్నం పట్టణ ప్రజలకు గ్యాస్ విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని, ఆన్లైన్లో బుక్ చేసుకుని స్థానిక ఎమ్మార్వోను సంప్రదిస్తే వెంటనే సిలిండర్ అందేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. గ్యాస్ సమస్య ఉంటే నేరుగా ఎమ్మార్వోను కలిసి పరిష్కరించుకోవచ్చని, ఎవరూ ఆందోళన పడకుండా రెండు రోజుల పాటు ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.