PEN POWER
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 11:30 am Posted By : SIVA KUMAR LANKA

నర్సీపట్నంలో తొలిజాగరంతో మొదలైన మరిడమ్మ జాతర

నర్సీపట్నంలో తొలిజాగరంతో మొదలైన మరిడమ్మ జాతర

-నర్సీపట్నంలో ఆధ్యాత్మిక శోభ

-డప్పులు, నేలడాన్సులు, శక్తి వేషాలతో పురవీధులలో గరగలు

నర్సీపట్నం, పెన్ పవర్ :

​నర్సీపట్నంలో తొలిజాగరణతో శ్రీమరిడి మహాలక్ష్మి అమ్మవారి గరగల జాతర మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, మొదటి రోజు నిర్వహించిన ‘తొలి జాగారం’ ఉత్సవం కనులపండువగా సాగింది. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాత నివాసం వద్ద ఆయన సతీమణి చింతకాయల పద్మావతి, వారి కుటుంబ సభ్యులు అమ్మవారి గరగలకు పాన్పు వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మావతి, వారి కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో గరగలను తలపై ధరించి ఊరేగింపుగా బయలుదేరారు. డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య నర్సీపట్నం పురవీధులన్నీ భక్తి పారవశ్యంతో పులకించాయి.


​అయ్యన్నపాత్రుడు పాత నివాసం నుంచి ప్రారంభమైన ఈ గరగల ఊరేగింపు 5 రోడ్ల జంక్షన్, తుని రోడ్డు, మెదర వీధి, వేంకటేశ్వర స్వామి గుడి, పాలఘాట్ సెంటర్, శారదానగర్, మెయిన్ రోడ్డు, రామారావుపేట, కుమ్మరి వీధి, కాపు వీధి మరియు నూకాలమ్మ మాన్యం రోడ్డు మీదుగా సాగింది. బుధవారం తెల్లవారేసరికి తిరిగి గరగలు అయ్యన్నపాత్రుడు నివాసం వద్ద ఉన్న రామాలయానికి చేరుకున్నాయి. భక్తులు అడుగడుగునా అమ్మవారికి నీరాజనాలు అర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


​ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మరిడి మహాలక్ష్మి అమ్మవారు తమ ఇంటి ఇలవేల్పు అని, రెండేళ్లకోసారి వచ్చే ఈ వేడుకను తమ కుటుంబం ఎంతో భక్తితో నిర్వహిస్తోందని తెలిపారు. ఈ నెల 26న రెండో జాగారం, 28న మూడో జాగారం, 31న పెద్ద జాగారం నిర్వహిస్తామని, ఏప్రిల్ 1వ తేదీన మరిడమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుందని వివరించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్, పార్టీ నాయకులు మరియు పట్టణ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.