
నర్సీపట్నం అభివృద్దికి అందరం కలిసి పనిచేద్దాం
-చివరి కౌన్సిల్ సమావేశంలో స్పీకర్ అయ్యన్న
-సరదాగా సాగిన చివరి కౌన్సిల్ సమావేశం
నర్సీపట్నం, పెన్ పవర్ (మార్చి 17) :
నర్సీపట్నం అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పని చేద్దామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. నర్సీపట్నం మున్సిపాలిటీ చివరి కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో చివరి కౌన్సిల్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశం ఆద్యంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. సభ్యులందరూ తమ ఐదేళ్ల కాలంలో అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం అభివృద్ధికి అందరం, పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, మహానుభావులైన నందమూరి తారక రామారావు, ఇందిరాగాంధీ లాంటి వారినే ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే లోపు నర్సీపట్నంకు సంబంధించి అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. స్పీకర్ హోదాలో తాను ఏ ఒక్క పార్టీకి పరిమితం కాదని, అభివృద్ధి విషయంలో అన్ని వార్డులను సమానంగా చూస్తానని అన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ నిధులు 21 కోట్లు నర్సీపట్నం మున్సిపాలిటీకి తీసుకువచ్చానని, మరో 10 కోట్లు వచ్చే నెలలో రానున్నాయని ప్రకటించారు. కౌన్సిలర్లు ఏ పార్టీ వారైనా తమ వార్డు ప్రజల కోసం తన వద్దకు వస్తే సహకరిస్తానని హామీ ఇచ్చారు. నర్సీపట్నంను పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. పెద్ద చెరువులో 108 అడుగుల భారీ శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దీనిని చూసేందుకు రానున్న రోజుల్లో వేలాదిమంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూకాలమ్మ పండుగ సందర్భంగా కౌన్సిలర్లు అందరూ జాతరలో పాల్గొనాలని ఆహ్వానించారు. చివరి కౌన్సిల్ సమావేశం సందర్భంగా హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడును, మున్సిపాలిటీ తరపున ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అలాగే మున్సిపాలిటీ తరఫున కౌన్సిలర్లు అందరినీ ఘనంగా సత్కరించి, జ్ఞాపకాలు అందజేశారు. చివరిలో కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులతో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఫోటో దిగారు. అనంతరం జరిగిన ఆత్మీయ విందులో అందరూ ఆనందంగా పాల్గొన్నారు.