PEN POWER
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 11:22 pm Posted By : SIVA KUMAR LANKA

నర్సీపట్నం నూకాంబికా అమ్మవారి దర్సనానికి పోటెత్తిన భక్తజనం

శ్రీనూకాంబికా అమ్మవారి దర్సనానికి పోటెత్తిన భక్తజనం

నర్సీపట్నం, పెన్ పవర్ :

కొత్త అమావాస్యను పురస్కరించుకుని నర్సీపట్నంలో శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారుజాము నుండే అమ్మవారి దర్శనానికి మహిళలు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. నూతన ఆలయంలో కొలువైన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నూతన ఆలయాన్ని, అమ్మవారి నూతన విగ్రహాన్ని దర్శించుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్ ల వద్ద టెంట్లు వేశారు. అమ్మవారి పండుగ పురస్కరించుకుని తరలి వచ్చే భక్తుల కోసం ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. మంగళవారం పెద్ద జాగరణ సందర్భంగా దళితవాడ నుంచి అమ్మవారి గరగలు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్నాయి. అక్కడ వారి ఆచారం ప్రకారం పాన్పు వేసి, పసుపు కుంకుమలు సమర్పించిన అనంతరం పురవీధులలో భక్తుల దర్శనార్థం ఊరేగింపుగా తిరిగాయి. గరగలతో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్, నూకాంబిక ఆలయ కమిటీ చైర్మన్ కొరప్రోలు శ్రీనివాసరావు మరియు పట్టణ ప్రముఖులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద జాగరణ సందర్భంగా అబీద్ సెంటర్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.