హుకుంపేట,పెన్ పవర్,మార్చి 30:అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని హుకుంపేట మండలం రంగశిల గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన సంప్రదాయ పండగలో ప్రమాదం చోటుచేసుకుంది. పండగ సందర్భంగా గిరిజన స్త్రీలు రహదారిపై తాడు కట్టి, ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులను ఆపి బొట్టు పెట్టి దక్షిణగా నగదు స్వీకరించడం ఆనవాయితీ. సోమవారం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో తాడు కట్టిన మహిళలు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా, అటుగా వేగంగా వెళ్తున్న ఓ బైక్‌దారుడు తాడును గమనించకుండా బలంగా ఢీకొన్నాడు. దీంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు.పట్టాం పంచాయతీకి చెందిన కొర్ర ధర్మారావుగా గుర్తించిన ఆ వ్యక్తికి మెడకు గాయమైంది. సన్నని ప్లాస్టిక్ తాడు మెడకు తగలడంతో ప్రమాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది.ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంప్రదాయాల పేరుతో రహదారులపై అడ్డంకులు సృష్టించడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రహదారులపై భద్రతా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.