పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 30
మండుతున్న ఎండలు, రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జీవజాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ, పక్షుల దాహార్తిని తీర్చేందుకు పుల్లలవచెరువు పోలీస్ స్టేషన్ ఎస్సై బి. సాంబ శివరావు వినూత్న చర్యలు చేపట్టారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో పలు చోట్ల చిన్న చిన్న టబ్బుల్లో నీటిని ఏర్పాటు చేసి పక్షులకు ప్రాణాధారంగా నిలిచారు.
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో చెట్లు, నీటి వనరులు తగ్గిపోవడం వల్ల పక్షులు నీటి కోసం ఎగిరే దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో వాటి ప్రాణాలు కాపాడాలని భావించిన ఎస్సై సాంబ శివరావు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.స్టేషన్ పరిధిలోని సిబ్బంది సహకారంతో పక్షులు సులభంగా చేరుకునే ప్రదేశాల్లో నీటి టబ్బులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రోజు వాటిలో స్వచ్ఛమైన నీటిని నింపుతూ పక్షులకు ఉపశమనం కలిగిస్తున్నారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మనుషులకే కాదు, ప్రతి జీవికి జీవించడానికి నీరు అవసరం.వేసవిలో పక్షులు నీటి కోసం అలమటిస్తుంటాయి. చిన్న ప్రయత్నంతో వాటి ప్రాణాలను కాపాడవచ్చు అని తెలిపారు.ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద, తోటల్లో చిన్న పాత్రల్లో నీటిని ఏర్పాటు చేసి పక్షులకు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.పోలీస్ స్టేషన్‌లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులంటే కేవలం చట్టం అమలు చేసే వారు మాత్రమే కాకుండా, సమాజం పట్ల బాధ్యతతో పనిచేసే వారని మరోసారి నిరూపితమైంది. పక్షులపై చూపిన ఈ మానవత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.ఇలాంటి చిన్న చర్యలతో ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.