PEN POWER
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 10:37 pm Posted By : PEN POWER MEDIA

పోలవరం జిల్లాలో ఏరులైపారుతున్న బెల్ట్ మద్యం

ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు – అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టం

ప్రభుత్వ మద్యం పాలసీ అంటే ఇదేనా

మామూళ్ల మత్తులో అధికార గణం

పోలవరం జిల్లాలో అక్రమ బెల్ట్ మద్యం విక్రయాలు విస్తృతంగా పెరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని సుమారు 12 మండలాల్లో దాదాపు ప్రతి గ్రామంలో ఒకటి లేదా రెండు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల వరకు మద్యం విక్రయాలు విస్తరించడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్ పోలవరం (రంపచోడవరం), మార్చి 8 :

జిల్లాలోని 11 మండలాల్లో ప్రభుత్వం 18 మద్యం షాపులను మంజూరు చేస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రతీ షాపు పరిధిలో రెండంకెల స్థాయిలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. లైసెన్సుడ్ మద్యం షాపుల్లో దొరకని బ్రాండ్లు కూడా ఈ బెల్ట్ షాపుల్లో దర్శనమిస్తున్నాయి. సరిహద్దు రాష్ట్రాల నుండి కూడా అక్రమంగా మద్యం దిగుమతి చేసుకుంటున్నారు.ప్రభుత్వం బెల్ట్ షాపుల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని పలుమార్లు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులే బెల్ట్ మద్యం సిండికేట్‌ను నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అధికార పార్టీ నాయకులకు సంబంధించిన షాపులు ఉండటంతో ఎక్సైజ్ అధికారులు కూడా వాటిపై చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో ఉన్న లైసెన్స్ పొందిన మద్యం దుకాణాల్లో కూడా ఎమ్మార్పీ ధరలకు మించి వసూళ్లు జరుగుతున్నాయని మద్యం ప్రియులు చెబుతున్నారు. బెల్ట్ షాపుల్లో అయితే ధరల దందా మరింత ఎక్కువగా జరుగుతోందని సమాచారం. ఒక్క క్వార్టర్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా షాపులు వద్దే అన్ని సౌకర్యాలతో బార్ లను తలపించే స్థాయిలో ఉంటున్నాయి.గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్యలు ఎదురవుతున్నా మద్యం మాత్రం ఎక్కడ చూసినా అందుబాటులో ఉందని గ్రామస్థులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.ఈ విషయమై ఎక్సైజ్ అధికారులను ప్రశ్నిస్తే సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణలో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారని సమాచారం. జిల్లాలో బెల్ట్ షాపులు లేవని, అన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయని వారు సమాధానం చెబుతున్నారని స్థానికులు అంటున్నారు. జిల్లాలోని ఏ మండలం నుండైనా బెల్ట్ షాపులు నిర్వహణపై కథనాలు వస్తే ఎక్సైజ్ అధికారులు తూతూ మంత్రంగా ఆ షాపు పరిధిలో ఏదో ఒక కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కేసులు కూడా మద్యం సిండికేట్ల కనుసనల్లోనే జరుగుతుంది. మద్యం సిండికేట్ అప్పగించిన వారిపై కేసులు నమోదు చేసి తమ డ్యూటీ అయిపోయిందని ఎక్సైజ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ బెల్ట్ షాప్ ల నిర్వహణతో ప్రభుత్వానికి రావలసిన ఆదాయం కూడా గండిపడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన పోచమ్మ గండి, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో అక్రమ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది.అక్రమ మద్యం విక్రయాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిపై స్పందన లేకపోవడంతో పాటు ఫిర్యాదు చేసిన వారిపైనే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

దీంతో ప్రజలు ఫిర్యాదులు చేయడానికి కూడా వెనుకంజ వేస్తున్నారని తెలుస్తోంది.ఇంకా బడి, గుడి వంటి ప్రజా స్థలాల సమీపంలో మద్యం షాపులు ఉండకూడదనే నిబంధనలను కూడా కొన్నిచోట్ల పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.గత ప్రభుత్వ కాలంలో మద్యం షాపులు ప్రధానంగా మండల కేంద్రాలకు మాత్రమే పరిమితమయ్యేవని, ప్రస్తుతం మాత్రం గ్రామాల వరకు విస్తరించాయని ప్రజలు చెబుతున్నారు. గతంలో స్థానికంగా లభించే నాటు సారా పై ఆధారపడిన మద్యం ప్రియులకు బెల్ట్ షాపుల ద్వారా లభిస్తున్న మద్యానికి అధిక ధరలు చెల్లించి ఆర్థికంగా కుటుంబం నష్టపోతున్నాయని మహిళల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . జీవనోపాధి కోసం నాటు సారా తయారీ లేదా అమ్మకాలు చేస్తే కేసులు నమోదు చేసే ఎక్సైజ్ అధికారులకు బెల్ట్ షాపులు దందా కానరావడం లేదా అంటూ పలువురు సారా వ్యాపారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు .ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తే జిల్లాలో ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అక్రమ బెల్ట్ షాపులపై తక్షణ చర్యలు తీసుకొని గ్రామాల్లో మద్యం విక్రయాలను నియంత్రించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.