రంపచోడవరం, మార్చి 28 (పెన్ పవర్):
పోలవరం జిల్లా తొలి కలెక్టర్‌గా కె. దినేష్ కుమార్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరం పి.ఎం.ఆర్.సి కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన పోలవరం పేరుతో ఏర్పడిన జిల్లాకు సేవలందించడం గర్వంగా భావిస్తున్నానని కలెక్టర్ పేర్కొన్నారు. “ప్రజలే ప్రథమం (People First)” అనే విధానంతో పరిపాలనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. కొత్త జిల్లాలో సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పాత్రికేయులతో కలిసి పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.ప్రజా సమస్యల పరిష్కారానికి వ్యక్తిగత బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేసిన కలెక్టర్, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పారదర్శక పరిపాలన అందించేందుకు హామీ ఇచ్చారు.ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని వెల్లడించిన ఆయన, జిల్లా అభివృద్ధికి అందరి సహకారం అవసరమని విజ్ఞప్తి చేశారు.బాధ్యతల స్వీకరణ అనంతరం జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ రాజ్ సహా అధికారులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందన లు తెలిపారు. 