ఓఆర్ఆర్ ఎగ్జిట్–4 దారి పేరుతో ప్రహరీ గోడ కూల్చివేతపై ఆరోపణలు..
నోటీసుకు లాయర్ ద్వారా రిప్లై ఇచ్చినా పట్టించుకోలేదని బాధితుల వాదన..
ముందస్తు సమాచారం లేకుండా చర్యలపై కాలనీ వాసుల ఆగ్రహం..
రోడ్డెక్కి నిరసనకు దిగిన ప్రణీత్ అంటీలియా కమ్యూనిటీ సభ్యులు..
వెంచర్ నిర్వహకులకు, బిల్డర్‌లకు, అక్రమ నిర్మాణ దారులకు, అధికారులకు ఉన్న అవినాభావ సంబంధం ఎప్పటికీ విడదీయలేని బంధంగా పేర్కొనవచ్చు.. అందుకు బలమైన కారణాలు కోకొల్లలు.. వెంచర్ నిర్వహకుల పరిధిలో ఉన్నంతవరకు, “అటు అధికార యంత్రాంగం- ఇటు రాజకీయ నాయకుల” అండదండలు పుష్కలంగా లభిస్తాయి.. కొనుగోలు దారులకు “ప్లాట్‌లు” అప్పగించిన తర్వాతే అసలైన “పాట్లు” మొదలవుతాయని సోమవారం హైడ్రా కూల్చివేతలు స్పష్టతను ఇస్తున్నాయి.. ప్రణీత్ అంటీలియా తోపాటు- పక్కనే ఉన్న “శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్”కు కూడా..! గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో, వెంచర్ నిర్వహకులు, బిల్డర్‌లకు అధికారులు.. రాజకీయ నాయకులు దోస్తీ చేసినోళ్ళు, ఇప్పుడు బాధితులతో కుస్తీ పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.. ఈ ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు అప్పుడు ఎక్కడికి పోయింది..? ఈ రోడ్డు ఇప్పుడే కొత్తగా మొలిచిందా..? అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు.. ప్రణీత్ అంటీలియా వెంచర్ నిర్మాణ సమయంలోనే అడ్డుకుని ఉంటే..! నేడు ఈ ఉద్రిక్తతలకు అవకాశం ఉండేదా..? బాధితులపై భారం పడేదా..? ఈ అడ్డుకోవడం అప్పుడే ఉంటే..? మరోచోట కొనుక్కునే వాళ్ళమని బాధితులు రోదించారు.. దీనంతటికీ అక్రమ వెంచర్ నిర్వాహకులకి సహకరించిన అధికారులు, రాజకీయ నాయకులే కీలక సూత్రదారులుగా బాధితులు ఆరోపిస్తున్నారు..
మేడ్చల్ జిల్లా బ్యూరో/దుండిగల్, మార్చి 9 (పెన్ పవర్):
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి ప్రాంతంలో ఉన్న ప్రణీత్ ఆంటీలియాలో అడ్డుగా ఉన్న ప్రహరీగోడను హైడ్రా కూల్చివేతల్లో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.. బాధితుల ఆక్రందనలు- రోదనలు ఆకాశాన్ని అంటాయి.. ముందస్తుగా సమస్యను గుర్తించిన హైడ్రా అధికారులు.. పోలీస్ భద్రతా బలగాలను రంగంలోకి దింపారు.. ఆ తర్వాతే హైడ్రా బుల్డోజర్‌లు కూల్చివేతలకు ఉపక్రమించాయి.. అయితే ప్రణీత్ అంటీలియా కాలనీవాసులు బుల్డోజర్‌లను అడ్డుకుని కూల్చివేతల వద్ద బైటాయించారు. దీంతో పోలీసులకు, కాలనీ వాసులకు కొంత తోపులాట జరిగింది.. స్వల్పంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.. ప్రణీత్ అంటీలియా కమ్యూనిటీ వాసులు తీవ్రంగా ఆవేదన చెందారు.. మున్సిపల్ పరిధిలో ఉన్న తమ కాలనీకి సంబంధించిన అన్ని పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉన్నప్పటికీ..! ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, హైడ్రా అధికారులు కమ్యూనిటీ ప్రహరీ గోడను కూల్చివేయడం అన్యాయమని వారు ఆరోపించారు.. కాలనీవాసుల వివరాల ప్రకారం, హైడ్రా అధికారులు ఉదయం అకస్మాత్తుగా కాలనీలోకి చేరుకుని ప్రహరీ గోడను యంత్రాలతో కూల్చివేశారు. కమ్యూనిటీ లోపలి నుంచి “ఔటర్ రింగ్ రోడ్” (ఓఆర్ఆర్) ఎగ్జిట్–4 వరకు రహదారి ఏర్పాటు చేయాల్సి ఉందని చెబుతూ ఈ చర్యకు పాల్పడ్డారని స్థానికులు పేర్కొన్నారు. ఈ చర్యతో కాలనీలో నివసిస్తున్న కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయని చెప్పారు..
సమయం ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారు: బాధితులు..
ఈ అంశంపై ఇప్పటికే శనివారం హైడ్రా అధికారులు కాలనీ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే ఆ నోటీసులకు స్పందిస్తూ తాము తమ లాయర్ ద్వారా అధికారులకు లిఖితపూర్వక సమాధానం పంపించినప్పటికీ, దానిని పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు తొందరపడి చర్యలు చేపట్టారని ఆరోపించారు.. సమాధానం పరిశీలించేందుకు సమయం ఇవ్వకుండా ఈ విధంగా గోడను కూల్చివేయడం సరైనది కాదని కాలనీవాసులు అభిప్రాయపడ్డారు..
కంటతడి పెట్టిన కాలనీ వాసులు..
ప్రహరీ గోడ కూల్చివేతపై ప్రణీత్ ఆంటీలియా కమ్యూనిటీ వాసులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.. అధికారులు కాలనీ వాసుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చర్యలు తీసుకోవడం, అడ్డొచ్చిన వారిపై పోలీసులతో అడ్డుకోవడాన్ని మీడియాతో ప్రస్తావిస్తూ మహిళలు కంటతడి పెట్టారు.. ఇప్పటికైనా తమ కమ్యూనిటీకి సంబంధించిన హక్కులు, భద్రత విషయంలో అధికారులు ఒక స్పష్టతను ఇవ్వాలని, సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. అవసరమైతే చట్టపరమైన పోరాటాన్ని కూడా కొనసాగిస్తామని హెచ్చరించారు..