PEN POWER
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 8:34 pm Posted By : PEN POWER TELANGANA

ప్రాణాలు కాపాడాల్సిన వాహనంలో..! ప్రైవేట్ ప్రయాణం..?

తెలంగాణ 108 అంబులెన్స్ రాజమండ్రిలో ప్రత్యక్షం..

*నిబంధనలకు పాతర.. ? ఈసీఐఎల్ ‘టు’ వయా నిజాంపేట్ ‘టు’ రాజమండ్రి..

108 అంబులెన్స్ సర్వీస్‌లలో ఏం జరుగుతోంది..?

హైదరాబాద్ ఈసీఐఎల్ నుంచి బయలుదేరిన 108 అంబులెన్స్..

నిజాంపేట్ మీదుగా రాజమండ్రి చేరినట్లు జిపిఎస్ లొకేషన్‌లు వైరల్..

అంబులెన్స్ అక్కడ ఉన్నట్లు అంగీకరించిన ఇఎంటి..

పై అధికారులనే అడగాలంటూ బాధ్యతా రహిత సమాధానం..!

నిబంధనల ప్రకారం 108 సేవలు రాష్ట్ర పరిధికే పరిమితం..

అంతర్రాష్ట్ర ప్రయాణాలపై అనుమానాలు వ్యక్తం..

రోగి తరలింపు కోసం వెళ్లిందా..? లేక ప్రభుత్వ వాహనం దుర్వినియోగమా..?

అత్యవసర సమయంలో స్థానికులకు సేవలు లేకపోతే బాధ్యత ఎవరిది..?

హైదరాబాద్‌లో అత్యవసర సేవల కోసం కేటాయించిన 108 అంబులెన్స్, నిబంధనలను పక్కనబెట్టి ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ప్రత్యక్షమవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రాణాలను కాపాడాల్సిన వాహనం ఇలా రాష్ట్ర సరిహద్దులు దాటడం వెనుక అసలు కారణం ఏమిటి..? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.. ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, పూర్తి స్థాయి విచారణ జరపాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది..

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, మార్చి 21:

ప్రాణాలు కాపాడాల్సిన అత్యవసర వాహనాలు పక్క దారి పడుతున్నాయా..? ఇప్పటికే గతంలో సోషల్ మీడియాలో ఇతర రాష్ట్రాలలో అంబులెన్స్‌లో ఇలాంటి ఘటనలు చూశాం.. ఇప్పుడు తెలంగాణలో బహుశా మొట్టమొదటి సారి బట్టబయలు అయింది కాబోలు.. నిబంధనల ప్రకారం రాష్ట్ర సరిహద్దులు దాటకూడని 108 అంబులెన్స్‌లు, ఏకంగా పక్క రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్న ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ లోని ఈసీఐఎల్‌కు చెందిన ఒక 108 అంబులెన్స్ ఏపీలోని రాజమండ్రిలో ప్రత్యక్షమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది..

వైరల్ అవుతున్న జీపీఎస్ లొకేషన్..

ఈసీఐఎల్ ప్రాంత ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కేటాయించిన 108 అంబులెన్స్.. ముందుగా నిజాంపేట్‌కు వెళ్లాలని నమోదు చేసుకుని అక్కడి నుంచి ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి వెళ్లినట్లు చెబుతున్నారు.. ఇందుకు సంబంధించిన జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) లొకేషన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, స్థానిక మాధ్యమాల్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. అధికారులనే అడగాలన్న ఈఎంటీఈ వ్యవహారంపై సదరు అంబులెన్స్ ఈఎంటీని సంప్రదించగా.. వాహనం రాజమండ్రిలో ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించడం గమనార్హం.. ఇలా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి 108 వాహనం వెళ్లడానికి నిబంధనలు ఒప్పుకుంటాయా..? అని ప్రశ్నించగా.. నాది చాలా చిన్న పోస్ట్,. దీనిపై నాకేమీ తెలియదు, పై అధికారులనే అడిగి తెలుసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు..

సమాధానం కోసం ప్రశ్నలు ఉత్పన్నం..

ఇవేసాధారణంగా 108 సేవలు కేవలం ఆయా రాష్ట్ర పరిధిలోని అత్యవసర వైద్య సేవలకు మాత్రమే పరిమితం. మెరుగైన వైద్యం కోసం కూడా పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లే అనుమతి వీటికి ఉండదు. అలాంటప్పుడు ఈసీఐఎల్ అంబులెన్స్‌కు రాజమండ్రి వెళ్లే అనుమతి ఎవరు ఇచ్చారు..? ఇది ఎవరైనా రోగిని తరలించడానికి వెళ్ళిందా..? లేక ఎవరైనా ఉన్నతాధికారుల సొంత పనుల కోసం ప్రభుత్వ వాహనాన్ని దుర్వినియోగం చేశారా..? అన్నది తేలాల్సి ఉంది. అత్యవసర వాహనం ఏపీలో ఉన్న సమయంలో, ఇక్కడ ఈసీఐఎల్ ప్రాంతంలో ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే బాధ్యత ఎవరిది..?ఈ ఘటనపై 108 ఉన్నతాధికారులు మరియు వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించి, విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ విషయంలో పై అధికారులు చెప్పడం వలనే తెలంగాణ 108 వాహనం రాజమండ్రికి వెళ్ళడం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది..